నయన్.. ఆ ఎమోషనల్ నోట్ వెనుక కారణం ఏంటంటే..
నయనతార కెరీర్‌ను గమనిస్తే, ఆమెకు వచ్చిన 'లేడీ సూపర్ స్టార్' అనే ట్యాగ్ కేవలం పబ్లిసిటీ కోసం క్రియేట్ చేసింది కాదు.
By: M Prashanth | 9 Oct 2025 10:21 AM ISTసినిమా ప్రపంచంలో 22 ఏళ్లు ఒక నటి అగ్రస్థానంలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తన నటన, అందం స్క్రీన్ ప్రెజెన్స్తో ఈ స్థాయికి ఎదిగిన నటి నయనతార. ఆమె కెరీర్ జర్నీ ఇప్పుడు ఒక పెద్ద రికార్డ్ ని చేరుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, నయనతార పంచుకున్న ఒక ఎమోషనల్ నోట్ ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.
నయనతార కెరీర్‌ను గమనిస్తే, ఆమెకు వచ్చిన 'లేడీ సూపర్ స్టార్' అనే ట్యాగ్ కేవలం పబ్లిసిటీ కోసం క్రియేట్ చేసింది కాదు. భాషతో సంబంధం లేకుండా, స్టార్ హీరోల పక్కన నటించినా, లేదా సోలో లీడ్ మూవీ చేసినా, ఆ సినిమాను బాక్సాఫీస్ వద్ద నిలబెట్టగల సత్తా నయన్ సొంతం. ఈ 22 ఏళ్లలో ఆమె చూపించిన కన్సిస్టెన్సీ మరియు స్టార్ పవర్ కారణంగానే ఆమె ఈ ఘనతను సాధించింది.
తాజాగా ఈ 22 ఏళ్ల ప్రయాణం పూర్తయిన సందర్భంగా, నయనతార అభిమానులకు, ఇండస్ట్రీకి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఎమోషనల్ లెటర్‌ను రిలీజ్ చేసింది. "మొదటిసారి కెమెరా ముందు నిలబడినప్పుడు, సినిమాలే నా ప్రపంచంగా మారుతాయని అనుకోలేదు. పరిశ్రమకు వచ్చాకే, ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి నిశ్శబ్దం నాకు ధైర్యాన్ని ఇచ్చి, నన్ను నన్నుగా మార్చాయి" అని ఆమె ఆ నోట్‌లో రాసుకున్నారు. ఈ జర్నీలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలియజేసింది.
నయనతార సినీ కెరీర్ 2003లో మలయాళ చిత్రం ‘మనస్సినక్కరే’తో మొదలైంది. ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది మాత్రం 'చంద్రముఖి' సినిమాతోనే. అప్పటినుంచి ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస విజయాలు నమోదు చేస్తూ వచ్చింది. ఈమధ్యనే 'జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి, అక్కడ కూడా తన మార్క్ చూపించింది.
ప్రస్తుతం కూడా లేడీ సూపర్ స్టార్ హవా ఏమాత్రం తగ్గలేదు. ఆమె చేతిలో దాదాపు 8 ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం. అందులో తెలుగు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్న భారీ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. 22 ఏళ్లుగా ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగుతున్న నయనతార పర్సనల్ లైఫ్ లో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక కొత్త ప్రాజెక్టులతో ఆమె ఇంకెంతకాలం బాక్సాఫీస్‌ను ఏలుతుందో చూడాలి.
