2026 లో లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇది!
గత ఏడాది లేడీ సూపర్ స్టార్ 'టెస్ట్' అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది
By: Srikanth Kontham | 3 Jan 2026 1:12 PM ISTగత ఏడాది లేడీ సూపర్ స్టార్ 'టెస్ట్' అనే ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. మాధవన్ , మీరాజాస్మిన్ లాంటి స్టార్లు ఉన్నా? ఎప్పుడు రిలీజ్ అయిందో? ఎప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిందో కూడా తెలియదు. అంతకు ముందు ఏడాది కూడా నయనతార 'బియోండ్ ది ఫెయిరీ టేల్' చిత్రం ఒక్కటే రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి జనాలకు తెలియకుండానే నిష్క్రమించింది. ఇలా 2024-25 రెండేళ్ల కాలంలో రెండు సినిమాలతోనే కనిపించింది. కానీ 2026 లో మాత్రం అన్ని లెక్కలు సరిచేసే ప్రణాళికతోనే బరిలోకి దిగుతుంది.
రెండు..కాదు మూడు కాదు. ఏకంగా తొమ్మిది సినిమాలతో అమ్మడు రప్ఫాడించబోతుంది. ఈ సంక్రాంతికి 'మనశంకర వరప్రసాద్ గారు'తో ఆరంభిస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కనిపిస్తుంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. అనీల్ స్కెచ్ వర్కౌట్ అయిందంటే? బాక్సాఫీస్ వద్ద 500 కోట్లు ఖాయమే. అలాగే పాన్ ఇండియా స్టార్ యశ్ నటిస్తోన్న 'టాక్సిక్' లో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని ఏకంగా గ్లోబల్ స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే కన్నడతో పాటు ఇంగ్లీష్ లోనూ తెరకెక్కించారు.
భారీ అంచనాల మధ్య మార్చిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `ముకుత్తు అమ్మన్ 2` రిలీజ్ అవుతుంది. ఇందులో అమ్మోరు పాత్రలో నయన్ కనిపించనుంది. లేడీ సూపర్ స్టార్ నుంచి రాబోతున్న మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రమిది. ఈ సినిమాపై కోలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ తప్పక అనువాదమయ్యే చిత్రమిది. అలాగే `మన్నాఘాటీ సిన్స్ 1960` లోనూ నయన్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటిస్తారు.
తమిళ్, మలయాళంలో తెరకెక్కుతోన్న 'డియర్ స్టూడెంట్స్' లోనూ నటిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మాలీవుడ్ లోనూ 'పేట్రియేట్' అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఈసినిమా ఆన్ సెట్స్ లో ఉంది. కోలీవుడ్ లో 'హాయ్', 'రాఖియే' అనే మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక తెలుగులో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 111వ చిత్రంలోనూ నయన్ హీరోగా ఖరారైంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాలన్నీ కూడా చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకురానున్నాయి.
