Begin typing your search above and press return to search.

200 ఆఫర్లు.. ఖాళీ చెక్కులు.. ఒకే ఒక్క రిజెక్షన్!

`గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ 2` తర్వాత జీవితంలో వచ్చిన మార్పులను న‌వాజుద్దీన్ గుర్తు చేసుకున్నారు.

By:  Srikanth Kontham   |   14 Sept 2026 4:00 PM IST
200 ఆఫర్లు.. ఖాళీ చెక్కులు.. ఒకే ఒక్క రిజెక్షన్!
X

సినిమా అనే ప్రపంచంలో అరంగేట్రం చేయడం ఒక ఎత్తైతే వచ్చిపడే ఆఫర్ల ప్రభంజనంలో ఒట్టుపెట్టుకుని సరైన మార్గాన్ని ఎంచుకోవడం మరొక ఎత్తు. ప్రతిభకు, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ఈ విషయంలో అరుదైన సంచలనం సృష్టించారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన `గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ 2` చిత్రంతో రాత్రికి రాత్రే దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా విడుదలైన తర్వాత తనను వెతుక్కుంటూ వచ్చిన వందలాది ఆఫర్లను, కోట్లాది రూపాయల పారితోషికాలను నిరాకరించారనే ఆసక్తికరమైన విషయాన్ని న‌వాజుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో ర‌వీల్ చేసారు.

`గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ 2` తర్వాత జీవితంలో వచ్చిన మార్పులను న‌వాజుద్దీన్ గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రం ఘన విజయం సాధించాక తన వద్దకు ఏకంగా 200లకు పైగా కథలు వచ్చాయని తెలిపారు. అంతేకాదు నిర్మాతలు ఆయన ముందు ఖాళీ చెక్కులు ఉంచి, నచ్చినంత అమౌంట్ రాసుకొని డేట్స్ ఇవ్వమంటూ కోరేవారని చెప్పు కొచ్చారు. అంతటి గొప్ప అవకాశాలు, భారీ ఆఫర్లు వ‌చ్చినా? నవాజుద్దీన్ వాటిలో ఒక్క సినిమాను కూడా సైన్ చేయలేదు.

`నా టేబుల్‌పై ఖాళీ చెక్కులు పడి ఉన్నా? వచ్చిన స్క్రిప్టులలో ఏదీ నాకు నచ్చలేదు. అందుకే ఆ ఆఫర్లన్నింటినీ తిరస్కరించాను. నాకు తగిన సరైన పాత్ర కోసం వేచి చూడాలని నిర్ణయించుకున్నాను` అని తెలిపారు. కథ నచ్చకుండా తొందరపడి ఏ ప్రాజెక్ట్‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌న్న‌ది న‌వాజుద్దీన్ సిద్దాంతం. అవకాశాల కోసం ఆరేళ్ల తరబడి వేచి చూసిన అనుభవం తనకు ఇప్పటికే ఉందని.. అందుకే సరైన ప్రాజెక్ట్ కోసం మరొక రెండు మూడేళ్లు వేచి చూడటానికి కూడా ఎప్పుడూ సిద్దంగా ఉంటాన‌న్నారు. అయితే అదృష్టవశాత్తూ ఆ స‌మ‌యంలో ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం రాలేదన్నారు.

2012లో రిలీజ్ అయిన `గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ 2` చిత్రంలో నవాజుద్దీన్ ఫైజల్ ఖాన్ అనే పాత్రలో ప్రేక్షకులను మైమరిపించారు. మొదట్లో అమాయకంగా, జాప్యం చేసే కుర్రాడిగా కనిపించే ఫైజల్ ఖాన్ పాత్ర తర్వాత కుటుంబంలో జరిగిన నష్టాలు, మోసాల వల్ల అత్యంత క్రూరుడైన గ్యాంగ్‌స్టర్‌గా మారుతుంది. ఈ పాత్రలో న‌వాజుద్దీన్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక నవాజుద్దీన్ ప్రస్తుత చిత్రాల విషయానికొస్తే.. ఇటీవల `మై యాక్టర్ నహీ హూ` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న `తుంబాడ్ 2` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ హారర్ థ్రిల్లర్ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.