మైత్రీ బాస్ పేరుతో మోసం.. చేసిందెవరంటే?
yerneninaveen పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి తానే నవీన్ యెర్నేని అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని వెల్లడించింది.
By: M Prashanth | 21 Dec 2025 12:51 PM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత నవీన్ యెర్నేని పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ప్రత్యక్షమవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి నవీన్ యెర్నేని పేరు వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు! దీంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది.
తమ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని పేరును వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు దృష్టికి వచ్చిందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. +91 7543869902 ఫోన్ నంబర్ ను సదరు వ్యక్తి ఉపయోగిస్తున్నాడని చెప్పింది.
yerneninaveen పేరుతో ఉన్న ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఉపయోగించి తానే నవీన్ యెర్నేని అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని వెల్లడించింది. అయితే ఆ ఫోన్ నంబర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అందుకే ఎవరూ కూడా మోసానికి గురికావద్దని సూచించింది మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.
ఆ ఫేక్ ఇన్ స్టా అకౌంట్ ను రిపోర్ట్ చేయాలని కోరింది. తమకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారమైనా @MythriOfficial అనే తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడిస్తామని స్పష్టం చేసింది. సినీ అవకాశాలు, ఇతర వ్యవహారాల పేరుతో జరిగే ఇలాంటి మోసాల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని మైత్రీ సంస్థ కోరింది.
అయితే 15 రోజుల క్రితం సైబర్ క్రైమ్ పై మైత్రీ మూవీ మేకర్స్ హెచ్చరించగా.. ఇప్పుడు పూర్తి వివరాలతో పోస్ట్ పెట్టింది. అదే సమయంలో ఆ సమస్యను ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒక్కటే కాదు. ఇప్పటికే అనేక బ్యానర్లు అదే ప్రాబ్లమ్ ను ఫేస్ చేశాయి. అందులో సౌత్ స,ినీ ఇండస్ట్రీకి చెందిన చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి.
గత ఏడాది నవంబర్ లో కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.. తాము ఏ సినిమాకు కూడా కాస్టింగ్ ఏజెంట్లను నియమించలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రముఖ దర్శక నిర్మాత పా రంజిత్ నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్.. అంతా నకిలీ కాస్టింగ్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. ఆడిషన్ కాల్స్ మోసపూరితమైనవని చెప్పింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్.. డబ్బు లేదా ఇతర ప్రయోజనాల కోసం తమ రాబోయే చిత్రం సర్దార్ 2 లో నటించే ఛాన్స్ ఇస్తామని చెప్పుకునే మోసగాళ్ల గురించి హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానికి ఇప్పుడు వివిధ నిర్మాణ సంస్థలు.. ఫేక్ అన్సౌన్స్మెంట్స్, అకౌంట్స్ తో ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి.
