Begin typing your search above and press return to search.

హిట్ డైరెక్టర్లకు.. ఈ హీరో కనిపించడం లేదా?

నాలుగు సినిమాలతో వరుస విజయాలు అందుకున్న నవీన్ పొలిశెట్టి ఇప్పటివరకు ఎక్కువగా కొత్త దర్శకులతోనే పనిచేశారు. అనిల్ రావిపూడి, వెంకీ అట్లూరి వంటి హిట్ దర్శకులతో ఆయన కాంబినేషన్ ఇంకా కుదరలేదు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా ఖరారైనా దర్శకుడి పేరు వెల్లడించలేదు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2027లో మొదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

By:  M Prashanth   |   27 Nov 2026 10:51 AM IST
హిట్ డైరెక్టర్లకు.. ఈ హీరో కనిపించడం లేదా?
X

టాలీవుడ్‌లో వరుస హిట్స్ ఇస్తున్న యువ హీరోల్లో నవీన్ పొలిశెట్టికి మంచి గుర్తింపు ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నుంచి అనగనగా ఒక రాజు వరకు నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. కామెడీ టైమింగ్‌తో పాటు తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నవీన్‌తో ఇప్పటివరకు ఒక్క స్టార్ డైరెక్టర్ కూడా సినిమా చేయకపోవడం ఆశ్చర్యమే. ముఖ్యంగా మంచి ఫామ్‌లో ఉన్న హిట్ దర్శకులతో నవీన్ కాంబినేషన్ ఎందుకో సెట్ కావడం లేదు.

నవీన్ కెరీర్‌ను గమనిస్తే ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేశారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకుడిగా పరిచయమయ్యారు. జాతిరత్నాలు తీసిన అనుదీప్‌కు అప్పటికి పెద్ద హిట్ లేదు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేష్ బాబు పి కూడా అప్పటికి పెద్దగా సక్సెస్‌లు అందుకోలేదు. ఇక అనగనగా ఒక రాజుతో మారి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా పెద్ద దర్శకుల కాంబినేషన్ లేకుండానే నవీన్ తన మార్కెట్ పెంచుకున్నారు.

నిజానికి నవీన్‌ను కేవలం కామెడీ హీరోగా మాత్రమే చూడలేం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో డిటెక్టివ్‌గా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో ఎమోషనల్ పాత్రలోనూ మెప్పించారు. అనగనగా ఒక రాజు రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నట్లు ట్రేడ్ అంచనాలు వచ్చాయి. అనిల్ రావిపూడి, వెంకీ అట్లూరి, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు నవీన్‌తో సినిమా చేస్తే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఆశించవచ్చు. అయినా అలాంటి కాంబినేషన్ ఒక్కటీ ఇప్పటివరకు ప్రకటించలేదు.

మరోవైపు నవీన్ తన సినిమాల రైటింగ్‌లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, అనగనగా ఒక రాజు సినిమాలకు రైటింగ్‌లో భాగమయ్యారు. దర్శకులతో కలిసి స్క్రిప్ట్‌ను డెవలప్ చేసుకోవడం నవీన్‌కు బాగా కలిసొచ్చింది. అయితే పెద్ద దర్శకులకు కూడా వాళ్లదైన వర్కింగ్ స్టైల్ ఉంటుంది. సరైన కథ, డేట్స్ కుదిరితేనే అలాంటి కాంబినేషన్లు సాధ్యమవుతాయి. నవీన్ లాంటి నటుడితో హిట్ దర్శకులు కూడా కొత్త తరహా కథలు ప్రయత్నించే అవకాశం ఉంది.

ఇక గత జూన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా ప్రకటించినప్పుడు నవీన్ చేసిన వీడియో గుర్తుండే ఉంటుంది. అందులో సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్, రిషబ్ శెట్టి కనిపించారు. అందరినీ ఒకే వీడియోలో చూపిస్తూ నవీన్ తనదైన కామెడీ చేశారు. అయితే ఆ దర్శకుల్లో ఎవరితోనూ సినిమా ప్రకటించలేదు. పెద్ద దర్శకులతో ఇంత మంచి పరిచయాలున్న నవీన్ కెరీర్‌లో మాత్రం ఇప్పటికీ కొత్త దర్శకులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది.

ప్రస్తుత లైనప్ విషయానికొస్తే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ కొత్త సినిమా ఖరారైంది. అయితే దర్శకుడి పేరు, టైటిల్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సైరన్ దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్ పేరు గతంలో వినిపించింది. మరోవైపు వెంకట్ బోయనపల్లి నిర్మాణంలోనూ ఓ సినిమా గురించి వార్తలు వచ్చాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్‌పై కూడా ప్రచారం ఉంది. కానీ దాని వివరాలను మేకర్స్ ప్రకటించలేదు. మైత్రీ ప్రాజెక్ట్ షూటింగ్ 2027లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.