నవీన్ పొలిశెట్టి.. ఒక వరం!
ఈ సినిమాలో నవీన్ నటన మరో లెవల్‌లో ఉంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, ఇంప్రూవైజేషన్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేశాయి.
By: M Prashanth | 24 Jan 2026 9:20 AM ISTటాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి రూటే వేరు. కేవలం యాక్టింగ్ మాత్రమే చేసి చేతులు దులుపుకునే రకం కాదు ఈయన. ఒక సినిమా కమిట్ అయ్యారంటే చాలు.. ఆ కథా చర్చల నుండి, ఎడిటింగ్ టేబుల్ వరకు, ఆఖరికి ప్రమోషన్ల స్ట్రాటజీ వరకు ప్రతి విషయంలోనూ నవీన్ వేలు ఉంటుంది. అందుకే సినిమాలు ఆలస్యమైనా సరే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం సాలిడ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సినిమా భారాన్ని తన భుజాల మీద మోస్తూ స్క్రీన్ మీద అద్భుతాలు చేయడం నవీన్ కి వెన్నతో పెట్టిన విద్య.
రీసెంట్ గా ఈ సంక్రాంతికి విడుదలైన 'అనగనగా ఒక రాజు' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మేకింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఆలస్యం అయ్యింది. గతంలో వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' విషయంలోనూ ఇదే జరిగింది. సాధారణంగా ఇలాంటి లేట్ ప్రాజెక్టుల మీద ఆడియన్స్ కి ఆసక్తి తగ్గిపోతుంది, కంటెంట్ పాతబడిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఈ రెండు సినిమాలను తన ఎనర్జీతో, తన మార్క్ కామెడీ టైమింగ్ తో నవీన్ ఫ్రెష్ గా ఉంచగలిగారు.
నవీన్ పొలిశెట్టి సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పాలి. ఒక దర్శకుడికి తన విజన్‌ను పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసే హీరో దొరకడం ఎంత ముఖ్యమో, ఒక నిర్మాతకు తన సినిమాను జనంలోకి తీసుకెళ్లే హీరో దొరకడం కూడా అంతే ముఖ్యం. నవీన్ ప్రమోషన్ల కోసం పడే కష్టం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 'అనగనగా ఒక రాజు' ప్రమోషన్ల కోసం అతను చేసిన హడావుడి, ఆ సినిమాను ఆడియన్స్ కి చేరువ చేసిన విధానం వల్లే సంక్రాంతి రేసులో ఈ సినిమా నిలబడగలిగింది.
ఈ సినిమాలో నవీన్ నటన మరో లెవల్‌లో ఉంది. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ, ఇంప్రూవైజేషన్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేశాయి. సాధారణంగా కనిపించే సీన్లను కూడా తన బాడీ లాంగ్వేజ్‌తో ఒక రేంజ్‌కి తీసుకెళ్లడం నవీన్ కే సాధ్యం. అందుకే థియేటర్లో ఆడియన్స్ కి అతని సినిమా అంటే ఒక క్లియర్ ఎగ్జైట్‌మెంట్ ఉంటుంది. నవీన్ స్క్రీన్ మీద ఉంటే బోర్ కొట్టదు అనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది.
'అనగనగా ఒక రాజు' సూపర్ హిట్ అవ్వడం వెనుక నవీన్ పడిన హార్డ్ వర్క్ క్లియర్ గా కనిపిస్తోంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎక్కడ లాగ్ ఉందో చూసుకుని, ఆడియన్స్ పల్స్ కి తగ్గట్టుగా సినిమాను ట్రిమ్ చేయడంలో అతని మేధస్సు పనిచేసింది. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ బాధ్యత తీసుకోవడం వల్లే, ఒక యావరేజ్ కథ కూడా నవీన్ చేతుల్లో పడితే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతోంది. సంక్రాంతి విన్నర్లలో ఒకరిగా నిలిచి నవీన్ తన సత్తా చాటారు.
ఏదేమైనా నవీన్ పొలిశెట్టి ఫార్ములా సక్సెస్ అయ్యింది. సినిమాలు కొంచెం లేట్ అయినా సరే, క్వాలిటీ విషయంలో, ఎంటర్టైన్మెంట్ విషయంలో అతను అస్సలు తగ్గడం లేదు. ఒక హీరో సినిమాను ఎలా ఓన్ చేసుకోవాలో నవీన్ చూసి నేర్చుకోవచ్చు. 'అనగనగా ఒక రాజు' ఇచ్చిన బూస్ట్ తో నవీన్ తర్వాతి ప్రాజెక్టులపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ వన్ మ్యాన్ షో మున్ముందు ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
