`ఏజెంట్ ఆత్రేయ` సీక్వెల్‌లో రియల్ లేడీ పోలీసాఫీసర్?
ఈ ఈవెంట్‌లో నవీన్ పోలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
By: Sivaji Kontham | 9 July 2026 9:21 AM ISTజాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జల్లు కురిపించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన `అనగనగా ఒక రాజు` (2026) చిత్రంతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నవీన్, తన మార్క్ కామెడీ టైమింగ్ - ఎనర్జిటిక్ స్పీచ్‌తో పోలీసు అధికారులను.. ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. ఈ వేదికపైనే ఆయన తన నెక్స్ట్ మూవీ అప్‌డేట్ ఇస్తూ.. త్వరలోనే తాను వెండితెరపై పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు.
ఈ ఈవెంట్‌లో నవీన్ పోలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల రాత్రి వేళల్లో అండర్ కవర్ ఆపరేషన్స్ నిర్వహించి వార్తల్లో నిలిచిన ఐపీఎస్ అధికారిణి సుమతి గారిపై నవీన్ ప్రశంసలు కురిపిస్తూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ అండర్ కవర్ ఆపరేషన్ రీల్‌లో సుమతి మ్యాడమ్ నటన అద్భుతంగా ఉందని కొనియాడిన నవీన్.. తన సూపర్ హిట్ డిటెక్టివ్ థ్రిల్లర్ `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్ర సీక్వెల్ తీస్తే అందులో లేడీ ఆఫీసర్ కు ఒక కీలక పాత్ర ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా.. ఆఫీసర్ ని తన సినిమాలో నటించేలా ఒత్తిడి తీసుకురావాలంటూ అక్కడున్న తెలంగాణ పోలీస్ అధికారులందరినీ సరదాగా కోరారు. ``మేం కలిసి ఏజెంట్ సీక్వెల్‌లో ఒక క్రేజీ కేస్‌ను సాల్వ్ చేస్తాము`` అంటూ పోలీసుల సమక్షంలో చేసిన కామెంట్స్ సభలో నవ్వుల పువ్వులు పూయించాయి.
నిజ జీవితంలో శాంతిభద్రతలను కాపాడే పోలీసు ఆఫీసర్లను వెండితెరపై నటులుగా మార్చిన సంఘటనలు భారతీయ సినిమా చరిత్రలో కొత్తేమీ కాదు. గతంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో పలువురు నిజ జీవిత పోలీస్ అధికారులు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. నవీన్ పోలిశెట్టి కూడా అదే బాటలో ఐపీఎస్ సుమతి గారిని వెండితెరకు ఆహ్వానించడం విశేషం. మరోవైపు.. తాను పోలీస్ ఆఫీసర్ రోల్ చేయబోతున్నందున... తనకు గన్ ఎలా పట్టుకోవాలో...ఎలా కాల్చాలో నేర్పించాలంటూ ప్రముఖ ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారిని నవీన్ వేదికపైనే రిక్వెస్ట్ చేయడం సభను మరింత హుషారెత్తించింది.
పోలీసుల విధులను కొనియాడటంతో పాటు.. జీవితంలో క్రమశిక్షణ, ఫిట్‌నెస్ సాధించడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని చెప్తూ పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లకు నవీన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నవీన్ స్పీచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుండగా.. ఖాకీ యూనిఫాంలో ఈ `ఏజెంట్` ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే క్యారెక్టర్-డ్రివెన్ కామెడీలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించే నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలోకి మారడం..అలాగే ఒక ఇన్వెస్టిగేటివ్ ఫ్రాంచైజీ సీక్వెల్ వైపు అడుగులు వేయడం.. ఎంతవరకు వ్యూహాత్మకమైనది? ఖాకీ యూనిఫామ్‌కు అవసరమైన గంభీరతను, బాధ్యతను కాపాడుకుంటూనే.. తన బ్రాండ్ ఇమేజ్ అయిన విలక్షణమైన కామెడీ టైమింగ్‌ను .. హాస్యచతురతను ఆయన స్క్రీన్‌పై ఎలా బ్యాలెన్స్ చేయగలరనేది ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
