Begin typing your search above and press return to search.

ఏజెంట్ సీక్వెల్‌పై ఎందుకీ ర‌చ్చ‌?

ఈ సంక్రాంతికి అన‌గ‌నగా ఒక రాజు చిత్రంతో వంద కోట్ల క్ల‌బ్బులో అడుగు పెట్టాడు యువ క‌థానాయ‌కుడు న‌వీన్ పొలిశెట్టి.

By:  Garuda Media   |   7 Feb 2026 11:03 PM IST
ఏజెంట్ సీక్వెల్‌పై ఎందుకీ ర‌చ్చ‌?
X

ఈ సంక్రాంతికి అన‌గ‌నగా ఒక రాజు చిత్రంతో వంద కోట్ల క్ల‌బ్బులో అడుగు పెట్టాడు యువ క‌థానాయ‌కుడు న‌వీన్ పొలిశెట్టి. ఇప్పుడు మిడ్ రేంజ్ స్టార్‌గా ఎదిగిన అత‌ను.. కెరీర్ ఆరంభంలో అవ‌కాశాల కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. కొన్ని సినిమాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన అత‌ను హీరోగా మారి, బ్రేక్ అందుకున్న‌ది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఆ చిత్రం.. తెలుగులో వ‌చ్చిన బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత న‌వీన్ వెనుదిరిగి చూసుకోలేదు. జాతిర‌త్నాలు, మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి, అన‌గ‌న‌గా ఒక రాజు చిత్రాల‌తో పెద్ద హిట్లు కొట్టాడు. ఐతే మ‌ధ్య మ‌ధ్య‌లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ చేయ‌డం గురించి అత‌ను మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ సినిమా చేస్తానంటున్నాడు. కానీ ఎంత‌కీ అది మొద‌లు కావ‌డం లేదు. అన‌గ‌న‌గా ఒక రాజు త‌ర్వాత కొత్త సినిమా గురించి చ‌ర్చ‌ల్లో ఉన్నాడు న‌వీన్. మ‌రోవైపు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ కొత్త సినిమా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా ఇటీవ‌లే అనౌన్స్ అయింది.

ఇలా న‌వీన్, స్వ‌రూప్ ఎవ‌రి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండ‌గా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ గురించి సోష‌ల్ మీడియాలో చ‌ర్చలు మొద‌ల‌య్యాయి. సిద్ధుతో స్వ‌రూప్ తీస్తున్న‌ది ఏజెంట్ సీక్వెలే అన్న ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఆ సినిమాకు న‌వీనే క‌రెక్ట్ అంటూ కొంద‌రు పోస్టులు పెట్ట‌డం మొద‌లుపెట్టారు. మ‌రోవైపు స్వ‌రూప్‌తో సంబంధం లేకుండా న‌వీన్.. అన‌గ‌న‌గా ఒక రాజు రైట‌ర్ చిన్మ‌యితో క‌లిసి వేరుగా ఏజెంట్-2 స్క్రిప్టు రెడీ చేసుకుంటున్న‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. న‌వీన్, స్వ‌రూప్ మ‌ధ్య సంబంధాలైతే అంత బాగా లేవ‌నిపిస్తోంది. అందుకే ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఏజెంట్-2 రావ‌డం సందేహంగా క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల ఊహాగానాల నేప‌థ్యంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నిర్మాత రాహుల్ యాద‌వ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఈ సీక్వెల్ గురించి తామే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని... అంత వ‌ర‌కు ఎదురు చూడాల‌ని పేర్కొన్నాడు. స్వ‌రూప్ కూడా ఈ పోస్టుపై స్పందిస్తూ.. ఏజెంట్ మూవీ అంద‌రి క‌ష్టానికి ఫ‌లితం అని.. ఊహాగానాలు క‌ట్టిపెట్టి, అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాల‌ని పేర్కొన్నాడు. మ‌రి ఏజెంట్-2 అస‌లుంటుందా.. ఉంటే ఎవ‌రెవ‌రుక‌లిసి చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రం.