Begin typing your search above and press return to search.

2025 రౌండప్‌.. నానితో టాలీవుడ్ కు ధైర్యం?

అయితే ఆ మార్పుకు బలమైన పునాది వేసింది మన నేచురల్ స్టార్ నాని అని ఇప్పుడు టాక్!

By:  M Prashanth   |   31 Dec 2025 3:27 PM IST
2025 రౌండప్‌.. నానితో టాలీవుడ్ కు ధైర్యం?
X

మరికొన్ని గంటల్లో 2025 కంప్లీట్ అయిపోతుండగా.. అంతా 2026కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోతున్నాం. అయితే ఈ ఏడాది టాలీవుడ్ కు అనుకున్న స్థాయిలో కలిసి రాలేదని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన హై బడ్జెట్ చిత్రాలు వరుసగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి.

కలెక్షన్లు పడిపోవడంతో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా ఆందోళన చెందారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చిన్న చిత్రాలు.. పెద్ద విజయాలుగా మారి అదరగొట్టాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించి ఉపశమనంగా మారాయి. అయితే ఆ మార్పుకు బలమైన పునాది వేసింది మన నేచురల్ స్టార్ నాని అని ఇప్పుడు టాక్!

నిజానికి ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాని.. అటు హీరోగా.. ఇటు నిర్మాతగా ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆయనకు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టార్ కాస్టింగ్ లేకుండా, కేవలం కంటెంట్ పై మీద నిలబడిన కోర్ట్ చిత్రాన్ని ఆయన నిర్మించారు. కమర్షియల్ హంగులు లేకపోయినా, అందరినీ ఆకట్టుకునే హత్తుకునే కథతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నాని నమ్మకం పెట్టుకున్నారు.

అదే నిజమైంది. కోర్ట్ విడుదలతో థియేటర్లకు ప్రేక్షకుల రాక పెరిగింది. ఇది పరిశ్రమలో నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఆ సినిమా మంచి వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ప్రమోషన్ల విషయంలో కూడా నాని కొత్త దారిని చూపించారు. ఎక్కువ హంగులు లేకుండా.. తప్పుడు హైప్ కాకుండా నిజాయితీగా సినిమా గురించి మాట్లాడటం, ప్రేక్షకుల పల్స్ పై ఫోకస్ పెట్టడం ద్వారా ఎలా ప్రచారం చేయాలో నిరూపించారు.

అంతేకాదు, తాను హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3 విషయంలో కూడా ఏకంగా సినిమా నచ్చకపోతే చూడాల్సిన అవసరం లేదంటూ ధైర్యంగా చెప్పారు. అది కంటెంట్ పై ఉన్న ఆయన నమ్మకానికి ఒక ఎగ్జాంపుల్. కట్ చేస్తే.. ఆ సినిమా కూడా థియేటర్స్ లో సందడి చేసి భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది.

కోర్ట్ సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి లేకపోగా.. మళ్లీ హిట్-3 అదరగొట్టింది. నాని కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ రెండు సినిమాలతో నిర్మాతలు సహా అందరికీ భారీ లాభాలు వచ్చాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. నానికి చెందిన రెండు చిత్రాల రిజల్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అలా 2025లో టాలీవుడ్ ను సంక్షోభం నుంచి బయటకు తీసుకు వచ్చిన వ్యక్తిగా నాని పేరు ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. సరైన టైమ్ కు ఇండస్ట్రీకి ఆయన ధైర్యం చెప్పినట్లు అయిందని, నమ్మకం తిరిగొచ్చేలా చేశారని అంతా అభిప్రాయపడుతున్నారు. మరి 2026లో నాని.. ఎంతటి రీతిలో అదరగొడతారో వేచి చూడాలి.