Begin typing your search above and press return to search.

నాని 'డబుల్' దూకుడు.. జోష్ కొనసాగించడం పక్కానా?

దసరాతో మాస్ అవతార్‌ లో అదరగొట్టిన నాని, హాయ్ నాన్నతో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకులను కట్టిపడేశారు.

By:  M Prashanth   |   4 Feb 2026 8:00 AM IST
నాని డబుల్ దూకుడు.. జోష్ కొనసాగించడం పక్కానా?
X

నేచురల్ స్టార్ నాని అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ముందుగా గుర్తుకొచ్చేది సహజమైన నటన, కథలకు ప్రాధాన్యత ఇచ్చే సెలెక్షన్. కెరీర్ ప్రారంభం నుంచే బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్‌ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నాని, ఇప్పుడు స్టార్ హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగానూ తనదైన ముద్ర వేస్తున్నారు. హీరోగా వరుస విజయాలు సాధిస్తున్న ఆ స్టార్, నిర్మాతగా కూడా అదే జోష్ కొనసాగిస్తారా అన్న ఆసక్తి ఇండస్ట్రీలో పెరుగుతోంది.

దసరాతో మాస్ అవతార్‌ లో అదరగొట్టిన నాని, హాయ్ నాన్నతో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత కూడా వరుస హిట్స్ అందుకున్నారు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకోవడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ది ప్యారడైజ్ వంటి భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్‌ తో మరోసారి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

హీరోగా ఆయన కెరీర్ స్పీడ్ చూస్తుంటే… మరో లెవల్‌ కు వెళ్లేలా కనిపిస్తోంది. ఇదే సమయంలో నిర్మాతగా కూడా నాని తీసుకుంటున్న నిర్ణయాలు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌ పై కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తూ కొత్త దర్శకులు, కొత్త కథలకు వేదిక కల్పిస్తున్నారు నాని. ఇప్పటికే హిట్ ఫ్రాంచైజ్‌ తో థ్రిల్లర్ జానర్‌ లో మంచి బ్రాండ్ క్రియేట్ చేశారు. ప్రతి పార్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ కమర్షియల్ సక్సెస్ సాధించింది.

అలాగే చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద లాభాలు తెచ్చిపెట్టింది. తక్కువ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఆ చిత్రం 2025లో అత్యధిక లాభాలు సాధించిన చిన్న చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం. దీంతో నిర్మాతగా నాని కథలపై పెట్టే నమ్మకం, ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో మరోసారి రుజువైంది. 2026లో నిర్మాతగా నాని నుంచి ఎలాంటి సినిమాలు లేకపోయినా… 2027 కోసం మాత్రం భారీ ప్లాన్ రెడీ చేస్తున్నారట.

ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైనప్ లో పెట్టడం విశేషం. అందులో ఒకటైన హిట్ 4లో తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కోర్ట్ దర్శకుడు రామ్ జగదీష్‌ తో మరో సినిమా ప్లాన్ చేస్తుండగా, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి.

తన సోదరి దీప్తి ఘంటా దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ సినిమా కూడా నిర్మించబోతున్నారు నాని. మొత్తానికి హీరోగా వరుస హిట్స్‌ తో దూసుకుపోతున్న నాని… నిర్మాతగా కూడా అదే సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తారా అన్న చర్చ మొదలైంది. కథలపై నమ్మకం, కొత్త టాలెంట్‌ కు అవకాశం, కంటెంట్‌ కు ప్రాధాన్యత.. ఇవన్నీ చూస్తుంటే వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ నుంచి మరోసారి విజయాల పరంపర కొనసాగడం ఖాయమే అనిపిస్తోంది. హీరోగానే కాదు.. నిర్మాతగానూ నాని డబుల్ దూకుడు చూపించడానికి సిద్ధమయ్యారనే చెప్పాలి.