Begin typing your search above and press return to search.

నేషనల్ అవార్డుల రేసులో టాలీవుడ్ ఆశలన్నీ ఆ సినిమాపైనే!

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కోసం సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 July 2026 5:00 PM IST
నేషనల్ అవార్డుల రేసులో టాలీవుడ్ ఆశలన్నీ ఆ సినిమాపైనే!
X

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన కోసం సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024 సంవత్సరానికి సంబంధించిన విజేత‌ల‌ పేర్లను కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనుండగా.. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టంతా ఒకే సినిమాపై కేంద్రీకృతమైంది. అదే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ స్పెక్టకిల్ కల్కి 2898AD.

పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, ఇండియ‌న్ సినిమా టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిందనే ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ వంటి అంశాలు దేశవ్యాప్తంగా సినీ విశ్లేషకుల ప్రశంసలను అందుకున్నాయి. అందుకే ఈసారి నేష‌న‌ల్ అవార్డ్స్ లో కల్కి 2898AD పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

సినీ వర్గాల్లో జరుగుతున్న డిస్క‌ష‌న్ ప్రకారం.. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేట‌గిరీలో ఈ సినిమా స్ట్రాంగ్ పోటీదారుగా నిలిచిందని భావిస్తున్నారు. సినిమాలో ఉపయోగించిన VFX క్వాలిటీ, భారీ స్థాయిలో రూపొందించిన కల్పిత ప్రపంచం, అత్యాధునిక టెక్నాల‌జీ వినియోగం వంటి అంశాలు జ్యూరీని ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు, కొన్ని వర్గాలు ఈ సినిమా బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేటగిరీలో కూడా బలమైన పోటీ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భారతీయ పురాణాలను భవిష్యత్ నేపథ్యంలో మిళితం చేసిన కథనం, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ విజన్, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయని చెబుతున్నారు. అయితే ఈ విభాగంలో ఇతర భాషల నుంచి కూడా బలమైన పోటీ ఉండటంతో తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి కల్కి 2898ADకి కనీసం ఒక నేష‌న‌ల్ అవార్డు ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా #Kalki2898AD, #NationalFilmAwards వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతూ.. చిత్ర బృందానికి అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా టెక్నిక‌ల్ టాలెంట్ ను నేష‌న‌ల్ లెవెల్ లో మరోసారి చాటిచెప్పే సినిమాగా కల్కి నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే జ్యురీ తన ఎంపిక ప్రక్రియను పూర్తి చేయగా, అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ మాత్రమే మిగిలి ఉంది. మరి టాలీవుడ్ ఆశలను కల్కి 2898AD నిజం చేస్తుందా? ప్రభాస్ కెరీర్‌లో మరో జాతీయ స్థాయి గౌరవాన్ని ఈ సినిమా తీసుకొస్తుందా? లేక ఇతర సినిమాలు అనూహ్యంగా అవార్డులను దక్కించుకుంటాయా? అనే ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది. ప్రస్తుతం మాత్రం జాతీయ అవార్డుల రేసులో కల్కి పేరు తెలుగు సినీ వర్గాల్లో అత్యంత బలంగా వినిపిస్తోంది.