Begin typing your search above and press return to search.

కూతురు వయసున్న నటీమణితో రొమాన్స్‌!

బాలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కేవలం నటనలోనే కాదు నిజాయితీకి, నిబద్ధతకు కూడా ఎంతో పేరుగాంచారు.

By:  Srikanth Kontham   |   28 Oct 2026 1:00 AM IST
కూతురు వయసున్న నటీమణితో రొమాన్స్‌!
X

బాలీవుడ్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కేవలం నటనలోనే కాదు నిజాయితీకి, నిబద్ధతకు కూడా ఎంతో పేరుగాంచారు. 1989లో విడుదలైన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ `త్రిదేవ్` షూటింగ్ సమయంలో ఆయన ప్రదర్శించిన నిజాయితీ గురించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో టీనేజ్ నటి సోమ్ ఖాన్ సరసన ఆయన ఓ రొమాంటిక్ పాత్రలో నటించాల్సి ఉంది. అయితే సహనటి వయసు తన కుమార్తె వయసు కంటే తక్కువగా ఉండటంతో షూటింగ్ ప్రారంభానికి ముందే ఆయన స్వయంగా దర్శకుడిని అప్రమత్తం చేయడం విశేషం.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజీవ్ రాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. `త్రిదేవ్` చిత్రంలో ప్రసిద్ధమైన `చిర్చి టోపివాలే` పాటతో పాటు పలు రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో నసీరుద్దీన్ షా వయసు 38 సంవత్సరాలు కాగా.. సోనమ్ ఖాన్ అప్పట్లో టీనేజర్‌గా ఉన్నారు. ఈ భారీ వయసు వ్యత్యాసం తెరపై ఎలా కనిపిస్తుందనే దానిపై నసీరుద్దీన్ షా ముందుగానే ఆలోచించి దర్శకుడితో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చించారు.

రాజీవ్ రాయ్‌తో స్క్రిప్ట్ గురించి చర్చిస్తున్న సమయంలో నసీరుద్దీన్ షా పారదర్శకంగా వ్యవహరించారు. `నా మొదటి భార్య ద్వారా నాకు ఒక కుమార్తె ఉంది. ఆమె వయసు సోనమ్ వయసు కంటే పెద్దది. ఈ విషయం మీకు సమస్యగా అనిపిస్తుందా?` అని ఆయన నేరుగా దర్శకుడిని ప్రశ్నించారు. ఒక సీనియర్ నటుడిగా తనతో నటించే సహనటి వయసును దృష్టిలో ఉంచుకుని స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించడం షా ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.

అయితే రాజీవ్ రాయ్ మాత్రం ఈ విష‌యాన్ని తేలికగా తీసుకున్నారు. ఇది సినిమా మాత్రమేనని బదులిచ్చారు. ఒక జంటగా తెరపై ఇద్దరూ బాగానే కనిపిస్తారని, సినిమా అనేది ఒక డాక్యుమెంటరీ కాదని నసీరుద్దీన్‌కు చెప్పినా? ఒక నటుడిగా తన కర్తవ్యంగానే ఈ విషయాన్ని చెప్పానని నసీరుద్దీన్ షా తెలపడంతో ఆయన నిజాయితీ ఆకట్టుకుంది.

దర్శకుడు సోనమ్ ఖాన్ ని కూడా వయసు వ్యత్యాసం గురించి అడిగి సౌకర్యంగా ఉందా? లేదా? అని పరిశీ లించారు. కానీ సోనమ్ ఖాన్ మాత్రం నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటుడితో నటించే అవకాశం రావడం తన అదృష్టమని.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తానెంతో ఆసక్తిగా ఉన్నానని బదులిచ్చారు. కాస్టింగ్‌ను మార్చవద్దని ఆమె కోరడంతో యూనిట్ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా షూటింగ్‌ను కొనసాగించింది.

తెరవెనుక జరిగిన చిన్న సంఘటన నసీరుద్దీన్ షా వృత్తిపరమైన నిబద్ధతను, తోటి నటీనటుల పట్ల ఆయన చూపిన గౌరవాన్ని మరోసారి చాటిచెప్పింది. గ్లామర్ హంగుల కంటే పాత్రలపై, నైతిక విలువలపై నటులు ఎలాంటి క్లారిటీతో ఉంటారో చెప్పడానికి ఈ ఉదాహరణ స‌రిపోతుంది. కాలం మారినా నసీరుద్దీన్ షా కెరీర్‌లో చోటుచేసుకున్న ఈ అరు దైన సంఘటన బాలీవుడ్ వర్గాల్లో ఎప్పటికీ ప్రత్యేకమే.