Begin typing your search above and press return to search.

సినిమా మీద నమ్మకం సరిపోతుందా శర్వా?

శర్వానంద్ ఇంత పోటీలో ఎలా తన సినిమాను నిలబెడతాడనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ ‘నారి నారి నడుమ మురారి’ని సంక్రాంతి రేసులోనే నిలబెట్టారు మేకర్స్.

By:  Garuda Media   |   11 Jan 2026 5:00 PM IST
సినిమా మీద నమ్మకం సరిపోతుందా శర్వా?
X

ఈసారి సంక్రాంతి రేసులోకి చివరగా వచ్చిన సినిమా.. నారి నారి నడుమ మురారి. ఈ చిత్రాన్ని కూడా పండక్కే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినపుడు.. ఊరికే పబ్లిసిటీ కోసం ఆ డేట్ ఇచ్చారే తప్ప అంత పోటీలో ఇదెక్కడ వస్తుందనే కామెంట్లు వినిపించాయి. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ ఇంత పోటీలో ఎలా తన సినిమాను నిలబెడతాడనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ ‘నారి నారి నడుమ మురారి’ని సంక్రాంతి రేసులోనే నిలబెట్టారు మేకర్స్.

ఈ సినిమా టీజర్ చూస్తే.. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమైంది. పైగా ‘సామజవరగమన’ లాంటి సూపర్ ఫన్ మూవీ తీసిన రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. థియేటర్ల విషయంలోనే ఇబ్బంది తప్పదని అనుకున్నారు. ఐతే దిల్ రాజుకు సినిమాను అప్పగించడం ద్వారా నిర్మాత అనిల్ సుంకర తెలివైన ఎత్తుగడ వేశారు. సినిమాకు కొంచెం తక్కువ స్క్రీన్లు దక్కినా సరే.. మరీ ఇబ్బంది అయితే లేదు.

ఐతే కంటెంట్ మీద నమ్మకం ఉంది, మంచి డిస్ట్రిబ్యూటర్ దొరికాడు, థియేటర్ల సమస్య లేదు.. ఇలా అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉందని ప్రేక్షకులకు తెలుసా అన్నదే ప్రశ్నార్థకం. ఈ సినిమాకు పబ్లిసిటీ అనుకున్న స్థాయిలో జరగడం లేదు. మిగతా సంక్రాంతి సినిమాలన్నింటికీ ప్రమోషన్లు హోరెత్తించారు. ప్రభాస్, చిరంజీవి సినిమాలకు పబ్లిసిటీనే అవసరం లేదసలు. అయినా ప్రమోషన్లు బాగానే జరిగాయి. ‘అనగనగా ఒక రాజు’ను నవీన్ పొలిశెట్టి కొన్ని నెలలుగా ప్రమోట్ చేస్తున్నాడు. రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి ప్రమోషన్లు కొంచెం లేటుగా మొదలుపెట్టినా.. తర్వాత మంచి స్పీడు మీదే నడిచాయి. ఐతే ‘నారి నారి నడుమ మురారి’కి మాత్రం పబ్లిసిటీ పుష్ సరిగా లేదు.

ఇప్పటిదాకా సినిమాకు సంబంధించి ఏ ప్రమోషనల్ ఈవెంట్ చేయలేదు. హీరో హీరోయిన్లు ఒకటీ అరా ఇంటర్వ్యూలు ఇచ్చినా.. సోషల్ మీడియాలో పెద్దగా డిస్కషన్ లేదు. మీడియా ఫోకస్ అంతా కూడా మిగతా సినిమాల మీదే ఉంటోంది కానీ.. శర్వా చిత్రం మీదికి రావడం లేదు. రిలీజ్ డేట్ బాగా దగ్గిరికి వచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడైనా సినిమాను శర్వా అండ్ కో కొంచెం గట్టిగా పుష్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.