సంక్రాంతిలో శర్వానంద్ హ్యాట్రిక్ ప్లాన్
జనవరి 14న సాయంత్రం సరిగ్గా 5 గంటల 49 నిమిషాలకు సినిమా థియేటర్లలో పడబోతోంది. బహుశా ఇది మంచి ముహూర్తం అయి ఉండొచ్చు లేదా ప్రీమియర్స్ ప్లానింగ్ అయి ఉండొచ్చు.
By: M Prashanth | 9 Dec 2025 6:42 PM ISTసంక్రాంతి పండగ రేసులో స్టార్ హీరోల సినిమాలు ఎన్ని ఉన్నా, శర్వానంద్ సినిమాకు మాత్రం ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆయనకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా బాగా కలిసొచ్చింది. గతంలో పెద్ద సినిమాల పోటీ మధ్యలో వచ్చి 'శతమానంభవతి', 'ఎక్స్ ప్రెస్ రాజా' రూపంలో రెండు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అదే జోష్ తో, హ్యాట్రిక్ కొట్టేందుకు 'నారీ నారీ నడుమ మురారి' అంటూ మరోసారి పండగ బరిలో దిగుతున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా తేదీ మాత్రమే చెబుతారు, కానీ ఇక్కడ వెరైటీగా సినిమా మొదలయ్యే టైమ్ ను కూడా పోస్టర్ లో వేయడం విశేషం. జనవరి 14న సాయంత్రం సరిగ్గా 5 గంటల 49 నిమిషాలకు సినిమా థియేటర్లలో పడబోతోంది. బహుశా ఇది మంచి ముహూర్తం అయి ఉండొచ్చు లేదా ప్రీమియర్స్ ప్లానింగ్ అయి ఉండొచ్చు. ఇంత పర్ఫెక్ట్ గా టైమ్ చెప్పారంటే మేకర్స్ ప్లానింగ్ ఎంత గట్టిగా ఉందో అర్థమవుతోంది.
ఇక రిలీజ్ చేసిన పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా, పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. హీరో శర్వానంద్ మెడలో దండలు వేసుకుని, చేతిలో రిలీజ్ డేట్ బోర్డు పట్టుకుని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయనకు అటు ఇటు హీరోయిన్లు సంయుక్త, సాక్షి వైద్య నిలబడి ఉన్నారు. వారి ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే హీరో పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని, ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లేదా ఫ్యామిలీ డ్రామా అని హింట్ ఇస్తున్నారు.
ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం దర్శకుడు రామ్ అబ్బరాజు. 'సామజవరగమన' లాంటి క్లీన్ అండ్ హిలేరియస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన తీస్తున్న సినిమా కావడంతో, ఇందులో కూడా కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం పక్కా యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని టాక్.
సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడతారు. సరిగ్గా వాళ్ళను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను సిద్ధం చేశారు. పోటీలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ, తమ కంటెంట్ మీద, దర్శకుడి సక్సెస్ ట్రాక్ మీద నిర్మాతలకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఏదేమైనా జనవరి 14న శర్వానంద్ మరోసారి తన లక్ ను పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ టీమ్, రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది. మరి ఈ 'మురారి' పండక్కి ఎంత సందడి చేస్తాడో, మూడో హిట్టు కొట్టి రికార్డు సృష్టిస్తాడో చూడాలి.
