రివ్యూను 'ఫుట్ బాల్ గేమ్'గా మార్చుతున్నారా?
అయితే రివ్యూల విషయంలో అసలు సమస్య అభిప్రాయాలు చెప్పడంలో లేదు. సినిమా చూడకుండానే కొందరు రివ్యూలు ఇవ్వడమే.
By: M Prashanth | 19 Oct 2026 10:36 AM ISTసినిమా రివ్యూ ఇవ్వడం తప్పు కాదు. ఒక మూవీతే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పడంలోనూ తప్పు లేదు. కానీ రివ్యూ విషయంలో మూవీ టీమ్స్, రివ్యూ ఇచ్చేవారి మధ్య జరిగే డిబేట్స్ కొన్నిసార్లు అసలు విషయాన్ని పక్కకు నెట్టేస్తున్నాయి. ఎవరి అభిప్రాయం సరైనదనే వాదనలో ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు. రివ్యూ అనేది మూవీ టీమ్ కు, రివ్యూ ఇచ్చేవారికి మధ్య ఫుట్బాల్ ఆటలా మారకూడదనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.
నిజానికి ఒకప్పుడు సినిమా రివ్యూలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. పత్రికల్లో వచ్చే రివ్యూలను ప్రేక్షకులు ఆసక్తిగా చదివేవారు. ఇప్పుడు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ద్వారా ఎన్నో అభిప్రాయాలు అందుబాటులోకి వచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విషయాలను, నచ్చని అంశాలను చెప్పగలుగుతున్నారు. ఆ ఛేంజ్ ను తప్పుగా చూడాల్సిన అవసరం లేదు.
అయితే రివ్యూల విషయంలో అసలు సమస్య అభిప్రాయాలు చెప్పడంలో లేదు. సినిమా చూడకుండానే కొందరు రివ్యూలు ఇవ్వడమే. ఒక సినిమాను చూసిన తర్వాత అది ఎలా ఉందో చెప్పడం, అందులోని మిస్టేక్స్ వివరించడం సహజం. కానీ సినిమా చూడకుండానే దాని గురించి ఒక నిర్ణయానికి వస్తే, ఆ ప్రేక్షకులు ఎలా నమ్మగలరు. అందుకే రివ్యూలను తప్పుబట్టడం కంటే, వాటిని ఇచ్చే పద్ధతిలో ఛేంజ్ రావాలి.
భిన్నమైన అభిప్రాయాలే సినిమా చర్చను ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి. కాబట్టి రివ్యూ ఇచ్చేవారు తమ అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదు. మూవీ టీమ్స్ కూడా ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలే రావాలని ఆశించకూడదు. విమర్శలు వచ్చినప్పుడు వాటిని కూడా ఒక అభిప్రాయంగా చూడగలగాలి. కానీ రెండు వైపుల మధ్య వాదనలు పెరిగి, ఎవరు ఎవరిని తప్పుబట్టారనే చర్చే మెయిన్ గా మారితే అసలు ప్రయోజనం ఉండదు.
ఒకవైపు సినిమా టీమ్, మరోవైపు రివ్యూ ఇచ్చేవారు.. వీరి మధ్య జరిగే కామెంట్స్ వార్ లో ఆడియన్స్ కూడా ఏది నమ్మాలో తెలియని పరిస్థితి రావచ్చు. అందుకే రివ్యూలను ఫుట్ బాల్ గేమ్ గా మార్చవద్దంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీనియర్ నటుడు నరేష్. రీసెంట్ గా థియేటర్స్ రిలీజ్ అయిన క్రేజీ కళ్యాణం మూవీ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
రివ్యూల వ్యవస్థ గొప్పదని చెబుతూనే, మూవీ చూడకుండా రివ్యూ ఇవ్వకూడదని అన్నారు. అంటే రివ్యూలు ఉండకూడదని కాదు.. వాటి విషయంలో నిజాయతీ ఉండాలన్నదే ఆయన కామెంట్స్ ఉద్దేశం. ఎవరి అభిప్రాయం వారిది. దాన్ని గౌరవిస్తూనే, సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వకూడదనే కనీస బాధ్యతను అంతా గుర్తుంచుకోవాలి. అప్పుడే రివ్యూలు తమ అసలు ఉద్దేశాన్ని నిలబెట్టుకుంటాయి. లేకపోతే సినిమా ఎలా ఉందనే చర్చ పక్కకు వెళ్లి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారనే ఫుట్ బాల్ గేమ్ గానే మిగిలిపోతుంది.
