నారా హీరో అల్ట్రా స్టైలిష్ మ్యాన్?
హీరో అవ్వడం అనేది వెయ్యి జన్మల పుణ్యఫలం! అని ఒక పెద్ద నిర్మాత తన మనసులో మాట చెప్పారు.
By: Sivaji Kontham | 21 Aug 2025 11:41 AM ISTహీరో అవ్వడం అనేది వెయ్యి జన్మల పుణ్యఫలం! అని ఒక పెద్ద నిర్మాత తన మనసులో మాట చెప్పారు. అందుకే చాలా మంది తమ జీవితకాలంలో ఒక్కసారైనా హీరో అయ్యేందుకు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నారు. నిర్మాతగా, హీరోగా ద్విపాత్రలు పోషించి చేతులు కాల్చుకున్నారు. అయినా హీరో అయ్యామనే సంతృప్తి ముందు ఏదీ నిలబడలేదు.
అయితే హీరో అయ్యేందుకు నారా రోహిత్ లాంటి రాజకీయ, సినీ నేపథ్యం ఉన్న ప్రముఖుడికి అంతగా శ్రమించాల్సిన అవసరం పడలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, దివంగత రామ్మోహన్ నాయుడు వారసుడిగా, అగ్ర హీరో బాలకృష్ణ ఆశీస్సులతో రోహిత్ కొన్నేళ్ల క్రితం `బాణం` అనే చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు. నటించిన మొదటి సినిమాతోనే ప్రతిభావంతుడిగా నిరూపించాడు. ఆ తర్వాత సోలో, రౌడీ ఫెలో లాంటి హిట్ చిత్రాలు అతడి కెరీర్ లో ఉన్నాయి. కానీ రోహిత్ ఎందుకనో కెరీర్ పరంగా వెనకబడ్డారు. అదే క్రమంలో అధిక బరువు కారణంగా మేకోవర్ కోసం ప్రయత్నిస్తూ సినిమాలను కూడా తగ్గించారు.
2024లో `ప్రతినిధి 2`లో నటించారు. 2025లో విడుదలైన `భైరవం` గ్యాప్ తర్వాత వచ్చినా, నటుడిగా మంచి పేరు తెచ్చింది. కొన్నిసార్లు అతడు నటించిన సినిమాల రిలీజ్ తేదీ టైమింగ్ కూడా విజయావకాశాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు `సుందరకాండ` అనే సినిమాతో నారా రోహిత్ తిరిగి అభిమానుల ముందుకు వస్తున్నారు. త్వరలో విడుదలకు రానున్న ఈ సినిమా తన కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా అని చెబుతున్నారు.
అదే సమయంలో రోహిత్ లుక్ పరంగా మేకోవర్ సాధించేందుకు చాలా శ్రమిస్తున్నానని చెప్పారు. కొన్నేళ్లుగా అధిక బరువు సమస్య ఉంది. గత మూడు చిత్రాల్లో అది కనిపించింది. కానీ ఇప్పుడు బరువు తగ్గి చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు రోహిత్. అతడు మునుముందు ఇంకా మార్పు చూస్తారని కూడా `సుందరకాండ` ప్రచార ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. `నా రూపం (లుక్) నాకు నచ్చకపోయినా నచ్చలేదనే చెబుతాను` అని స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడతారు రోహిత్. `ఈసారి సీరియస్ గా ప్రయత్నిస్తున్నాను.. మునుముందు ఇంకా ఊహించని మేకోవర్ ని చూస్తార`ని చెబుతున్నారు. టాలీవుడ్ లో యూనిక్ కథాంశాల్ని ఎంచుకునే హీరో నారా రోహిత్. అందుకే అతడి గ్రేట్ కంబ్యాక్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈసారి మారిన కొత్త లుక్ తో అతడిని ఛాలెంజింగ్ రోల్ లో చూసేందుకు ఆస్కారం ఉంది. అతడి నుంచి తదుపరి పెద్ద ప్రకటన కోసమే ఫ్యాన్స్ వెయిటింగ్.
