Begin typing your search above and press return to search.

నారా హీరో.. రీఎంట్రీలో అసలు ట్విస్ట్ ఇదే!

ఒకప్పుడు వైవిధ్యమైన కథలు, భిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్.. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

By:  M Prashanth   |   27 July 2026 8:38 AM IST
నారా హీరో.. రీఎంట్రీలో అసలు ట్విస్ట్ ఇదే!
X

ఒకప్పుడు వైవిధ్యమైన కథలు, భిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్.. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ హీరో.. రీఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈసారి నారా రోహిత్ జర్నీలో అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆయన దృష్టి కేవలం సినిమాల సంఖ్యపై కాకుండా, తన కెరీర్‌ కు మళ్లీ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడంపైనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టాలీవుడ్ లో నారా రోహిత్‌ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోల బాటలో వెళ్లకుండా.. కథకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలను ఎంచుకోవడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. సోలో, ప్రతినిధి లాంటి సినిమాలతో తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే వరుస ఫ్లాపులు రావడంతో కొంతకాలం పాటు ఆయన కెరీర్ వేగం తగ్గింది. 2018 తర్వాత నారా రోహిత్ సినిమాలకు దూరంగా ఉండటంతో ఆయన అభిమానుల్లో కూడా ఆసక్తి పెరిగింది.

ఇక రీఎంట్రీ ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్న సమయంలో 2024లో ప్రతినిధి 2తో తిరిగి వచ్చారు. ఆ సినిమాపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అయినా కూడా రోహిత్ వెనక్కి తగ్గకుండా కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తే.. ఈసారి నారా రోహిత్ ప్లాన్‌ లో మార్పు కనిపిస్తోంది.

గతంలో హీరో ఇమేజ్ కోసం ప్రయత్నించిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉన్న సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఆ సినిమాలో రోహిత్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్. అదే సమయంలో సౌండ్ ఇంజనీర్ సినిమాతో తనలోని మరో యాంగిల్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

చాలా కాలంగా సీరియస్ పాత్రల్లో కనిపించిన రోహిత్.. ఆ సినిమాలో ఎంటర్టైనింగ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక కపాలి సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. మూడు విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ నారా రోహిత్ తన మార్కెట్‌ ను తిరిగి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు.

అయితే నారా రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్‌ లో కీలకమైన అంశం ఒక్కటే.. ఒక స్ట్రాంగ్ హిట్. నటుడిగా ఆయనపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ బాక్సాఫీస్ విజయమే ఆయన కెరీర్‌ కు మళ్లీ ఊపు తీసుకురాగలదు. సరైన కథ, బలమైన పాత్ర, ప్రేక్షకుల రెస్పాన్స్ కలిస్తే.. నారా రోహిత్ మరోసారి టాలీవుడ్‌ లో తన స్థానాన్ని బలంగా చాటుకునే అవకాశం ఉంది. మరి ఈసారి రోహిత్ ఎంచుకున్న కథలు ఆయనకు కావలసిన ఆ విజయాన్ని అందిస్తాయా? ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఏ స్థాయిలో సాగుతుందో చూడాలి.