తల్లిదండ్రులుగా ప్రమోట్ పొందిన నారా రోహిత్- శిరీష.. జన్మించింది ఎవరంటే?
గత ఏడాది అక్టోబర్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. ఆ తర్వాత శిరీష తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు.
By: Madhu Reddy | 23 Jun 2026 1:04 PM ISTసినీ సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సెలబ్రిటీలు తమ వారసులకు వివాహం పేరిట కొత్త జీవితాన్ని అందిస్తుంటే.. మరికొంతమంది తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతూ కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరో, హీరోయిన్ తల్లిదండ్రులుగా ప్రమోట్ పొందుతూ అభిమానులను సర్ప్రైజ్ చేశారు. వారెవరో కాదు నారా రోహిత్ - శిరీష లేల్ల.
గత ఏడాది అక్టోబర్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. ఆ తర్వాత శిరీష తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు శిరీష పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు అభిమానులు, సినీ సెలబ్రిటీలు నారా రోహిత్ - శిరీష లేల్ల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం శిరీష లేల్ల , ఆమె శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఏది ఏమైనా ఇప్పుడు నారా కుటుంబంలోకి వారసుడి రాక ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం నారా రోహిత్ పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.
ప్రతినిధి 2 చిత్రంలో వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక పెద్దలను ఒప్పించి, అక్టోబర్ 13 2024 లో కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.. అదే ఏడాది ఆఖరిలో వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ సడన్గా నారా రోహిత్ తండ్రి పరమపదించడంతో పెళ్లిని కాస్త వాయిదా వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆశీస్సులతో 2025 అక్టోబర్ 30వ తేదీన ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. నారా రోహిత్ ఎవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడి కుమారుడు.
నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే..బాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నారా రోహిత్.. 2011లో సోలో సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర , అప్పట్లో ఒకడుండేవాడు వంటి విలక్షణమైన చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.ఇకపోతే కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన నారా రోహిత్ ఇటీవల భైరవం, సుందరకాండ వంటి చిత్రాలతో మళ్ళీ ప్రేక్షకులను అలరించారు.
ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదర్శ కుటుంబంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ చిత్రంతో పాటు ఈయన మరో ప్రాజెక్టులో కూడా సోలో హీరోగా అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస పెట్టి సినిమాలలో అవకాశాలందుకుంటూనే ఇటు వైవాహిక జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటూ మరింత బిజీగా మారిపోయారు నారా రోహిత్.
