Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ లోకి మరో హీరో.. ముహూర్తం ఎప్పుడంటే?

నారా కుటుంబం నుంచి మరో వారసుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోందా.. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ సందేహాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది.

By:  M Prashanth   |   18 March 2026 11:22 PM IST
పాలిటిక్స్ లోకి మరో హీరో.. ముహూర్తం ఎప్పుడంటే?
X

నారా కుటుంబం నుంచి మరో వారసుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోందా.. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ సందేహాలకు ఇప్పుడు బలం చేకూరుతోంది. సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్, లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకుంటానని చెప్పడంతో, ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చినట్లయింది.

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఆయన సొంత గ్రామమైన నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నారా రోహిత్, తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

తండ్రి జ్ఞాపకార్థం చేస్తున్న ఈ పనులే తనను ప్రజలకు మరింత దగ్గర చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు రోహిత్ సూటిగా సమాధానం ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజల ముందుకు వస్తానని, రాజకీయాల్లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

నారావారిపల్లె ప్రజలు ఇప్పటికీ తన తండ్రిని అంతగా గుర్తుపెట్టుకోవడం చూసి రోహిత్ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రేమే తనను బాధ్యతగా ముందుకు నడిపిస్తుందని చెప్పారు. నారా కుటుంబానికి రాజకీయాల్లో ఉన్న సుదీర్ఘ చరిత్ర అందరికీ తెలిసిందే. ఇప్పుడు రోహిత్ కూడా ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం విశేషం. కేవలం కుటుంబ నేపథ్యమే కాకుండా, ప్రజా సమస్యలపై పోరాడేందుకు తానూ సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.

భవిష్యత్తులో తాను చేపట్టబోయే ప్రణాళికలు ఏంటనేది త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని చెప్పారు. దీంతో నారా అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇక నారావారిపల్లె వేదికగా రోహిత్ తన రాజకీయ ఆకాంక్షలను బయటపెట్టడం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన కథలతో మెప్పించిన ఆయన, రాజకీయాల్లో ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రోహిత్ రాకపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఆయన రాకతో స్థానిక రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారుతాయో వేచి చూడాలి.