Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి కొడుకుతో ఈ ఫ‌న్ చూసారా.. నారా లోకేష్‌లో ఈ కోణం కూడా!

రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బహిరంగ సభల్లో కనిపించినప్పుడు సాధారణంగా వాతావరణం చాలా సీరియస్‌గా, ప్రోటోకాల్‌తో కొంత గ‌జిబిజిగా ఉంటుంది.

By:  Sivaji Kontham   |   30 July 2026 1:15 AM IST
రాజ‌మౌళి కొడుకుతో ఈ ఫ‌న్ చూసారా.. నారా లోకేష్‌లో ఈ కోణం కూడా!
X

రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బహిరంగ సభల్లో కనిపించినప్పుడు సాధారణంగా వాతావరణం చాలా సీరియస్‌గా, ప్రోటోకాల్‌తో కొంత గ‌జిబిజిగా ఉంటుంది. అయితే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ.. ఆయన భార్య పూజా ప్రసాద్ మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పునాదిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ కళాశాల భవనాన్ని కార్తికేయ అత్తగారు (పూజా ప్రసాద్ తల్లి) ఇచ్చిన విరాళంతో నిర్మించడంతో ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్‌తో పాటు కార్తికేయ, పూజా ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేదికపై అధికారిక వాతావరణం నెలకొన్న సమయంలో లోకేష్ తనదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించారు.

కార్యక్రమంలో భాగంగా లోకేష్ చిరునవ్వుతో పూజా ప్రసాద్ వైపు తిరిగి... ``కార్తికేయ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఉంటే చెప్పండి.. నేను ఉన్నాను కదా!`` అని సరదాగా ప్రశ్నించారు. దానికి పూజ నవ్వుతూ ``లేదండీ.. ఏమీ కంప్లైంట్స్ లేవు`` అని సమాధానమిచ్చారు. ఆమె సమాధానం వినగానే లోకేష్ పక్కనే ఉన్న కార్తికేయ వైపు చూస్తూ ``బచ్ గయా!`` (హమ్మయ్య.. తప్పించుకున్నావ్!) అని అనడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు.

ఈ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిరంతరం రాజకీయాలు, సమీక్షలతో బిజీగా ఉండే నారా లోకేష్ లోని ఈ సరదా కోణాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాజకీయం, సినిమా పరిధి దాటి కుటుంబ సభ్యుల మధ్య ఉండే చొరవతో లోకేష్ మాట్లాడిన తీరును పలువురు అభినందిస్తున్నారు.

ఎస్.ఎస్. కార్తికేయ.. రాజమౌళి దర్శకత్వం వహించే చిత్రాల నిర్మాణ బాధ్యతల్లో సృజనాత్మక విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అత‌డి భార్య పూజా ప్ర‌సాద్ ప్ర‌ముఖ గాయ‌నిగా సుప‌రిచితురాలు. జ‌గ‌ప‌తిబాబు అన్న‌య్య కుమార్తె అనే విష‌యం తెలిసిన‌దే. అధికారిక వేదికపై చోటుచేసుకున్న ఈ చిన్న అన్‌స్క్రిప్టెడ్ సరదా సంఘటన... ప్రస్తుతం నెట్టింట నెటిజన్లకు మంచి వినోదాన్ని అందిస్తోంది.