Begin typing your search above and press return to search.

లోకేష్ పేరు వెనక నాయుడు ఎందుకు లేదు ?

నారా లోకేష్ కి ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నారా లోకేష్ కి మీ పేరు వెనక నాయుడు అని ఎందుకు లేదు అన్న ప్రశ్న ఎదురైంది.

By:  Satya P   |   25 Sept 2026 11:15 PM IST
లోకేష్ పేరు వెనక నాయుడు ఎందుకు లేదు ?
X

నారా లోకేష్ కి ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నారా లోకేష్ కి మీ పేరు వెనక నాయుడు అని ఎందుకు లేదు అన్న ప్రశ్న ఎదురైంది. న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక ఎక్స్‌ప్రెస్ అడ్డా ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా ప్రతినిధులు ఇతర ప్రముఖులు లోకేష్ ని అనేక ప్రశ్నలు వేశారు. వాటికి ఆయన చాలా లౌక్యంగా చాకచక్యంగా సమాధానం చెప్పారు. అందులో ఒక ప్రశ్న అయితే అందరికీ ఆసక్తిని పెంచింది. అంతే కాదు ఏపీ ప్రజలలో కూడా నెలకొన్న సందేహాలకు సమాధానం లభించించినట్లు అయింది. అదే మీ పేరు వెనక నాయుడు ఎందుకు లేదు అని.

నాయుడు అని ఉంటుంది :

చంద్రబాబు నాయుడు, ఆయన తండ్రి ఖర్జూర నాయుడు, ఇక చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఇలా అందరికీ నాయుడు అని పేరులు ఉన్నాయి. మరి లోకేష్ కి ఎందుకు లేదు అన్న దానికి లోకేష్ చాలా సరదాగా సమాధానం చెప్పారు. తమ కుటుంబం కులాలకు అతీతంగా ఒక ఆధునిక కుల రహిత సమాజాన్ని ఆకాంక్షించడమేనని లోకేష్ చెప్పడం విశేషం. దీని మీద తన తండ్రి చంద్రబాబు ఎంతో ఆలోచించి తన పేరు వెనుక ఎలాంటి కులపరమైన ట్యాగ్‌లు ఉండకూడదనే ఉద్దేశంతో కేవలం నారా లోకేష్ అని మాత్రమే నామకరణం చేశారని ఆయన వివరించారు.

అభివృద్ధి చూడాలి :

ప్రస్తుత తరం రాజకీయాలలో కులాల కంటే కూడా చేసే పనులు చూపే అభివృద్ధి పారదర్శకమైన పరిపాలన విషయంలో మాత్రమే ప్రాధాన్యత సంతరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తన పేరు ఆధునిక ఆలోచనకు ప్రతిరూపమని ఆయన చెప్పుకొచ్చారు. లోకేష్ ఈ విధంగా కులాల ప్రస్తావనపై ఇచ్చిన స్పష్టమైన వివరణ జాతీయ స్థాయిలో అందరి ప్రశంసలు అందుకుందని చెప్పాలి. కుల రహితమైన ఆలోచనలు ఉండాలని లోకేష్ చెప్పడం కూడా ఈనాటి యువతకే కాకుండా అందరికీ ఒక స్పూర్తివంతమైన మాటగానే ఉంది అని అంటున్నారు.

అన్నీ అలాగే మరి :

ఇక నారా లోకేష్ విషయంలో చూతే ఆయన విద్యాభ్యాసం సమయంలో అదే పేరు ఉంచారు. అలాగే పాస్‌పోర్ట్ ఎన్నికల అఫిడవిట్లు ఇక అధికారిక పత్రాలన్నింటిలోనూ నారా లోకేష్ అన్న పేరునే ఉపయోగిస్తున్నారు. ఇక నాయుడు అనేది ఇంటి పేరు కాకపోవడం వల్లనూ అలాగే అది కేవలం కుల సామాజిక వర్గ విశ్లేషణగానే ఉండడం వల్ల చేర్చలేదని స్పష్టం చేశారు. అంతే కాదు ఈనాటి తరం తమ పేర్లలో ఎక్కడా ఇలాంటి తోకలను చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అది లోకేష్ కి ముందే ఆయన తండ్రి చంద్రబాబు అలవాటు చేశారు అని అంటున్నారు.

సామాజికపరమైనవే :

చాలా ప్రాంతాలలో చాలా సామాజిక వర్గాలలో తమ కులం ప్రాధాన్యతను తెలియచేసేలా మొత్తం పేరు వెనక ఈ విధంగా తగిలించుకోవడం గత అర్ధ శతాబ్ద కాలంలో ఎక్కువగా జరిగింది. అయితే ఆ తరువాత ఆ వైఖరి మారింది. అంతే కాదు చదువులు కూడా ఉన్నతంగా ఉండడం ఆలోచనలలో ఆధునిక భావాలు చోటు చేసుకోవడం వల్లనే ఈ విధంగా ప్రతీ వారూ తోక పేర్లను తగిలించుకోవడం మానేశారు అని అంటున్నారు. ఇది కాలంతో పాటు వచ్చిన మార్పుగానే అంతా చూస్తున్నారు. అయితే లోకేష్ కి ఈ ప్రశ్న రావడం దానికి ఆయన ఇచ్చిన జవాబు కూడా అందరినీ ఆలోచింపచేసేదిగా ఉంది అని అంటున్నారు.