నాలుగేళ్ల తర్వాత నాని రెండు..!
నేచురల్ స్టార్ నాని అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా విడుదలకు సిద్ధం అయింది.
By: Ramesh Palla | 17 Sept 2026 2:00 PM ISTనేచురల్ స్టార్ నాని అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా విడుదలకు సిద్ధం అయింది. వచ్చే వారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. ఇప్పటికే సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. అంతే కాకుండా సినిమాను భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుగోలు చేశారనే టాక్ సైతం వినిపిస్తుంది. నానితో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. అందుకే బయ్యర్లు సైతం రిస్క్ ఉండదనే నమ్మకంతో కొనుగోలు చేశారు. నాని లాంటి హీరోలు ఎక్కువ సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని చాలా మంది అంటూ ఉంటారు. కెరీర్ ఆరంభంలో ఏడాదికి మూడు నాలుగు అంతకు మించి సినిమాలు చేసిన నాని మెల్లమెల్లగా సినిమాల సంఖ్య తగ్గిస్తూ వస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా ఆయన నుంచి ఏడాదికి ఒకటి చొప్పున మాత్రమే సినిమాలు వస్తున్నాయి.
దసరా, హాయ్ నాన్న సినిమాల తర్వాత...
2023లో నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఏడాదికి ఒకటి చొప్పున మాత్రమే విడుదల అవుతూ వస్తున్నాయి. 2024లో సరిపోదా శనివారం, 2025లో హిట్ మూవీతో రాగా 2026లో ది ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కానీ 2027లో మాత్రం రెండు సినిమాలతో రావాలనే పట్టుదలతో నాని ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రెండు సినిమాల ఫార్ములాను ఇకపై అయినా కొనసాగించాలని నాని భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ది ప్యారడైజ్ మూవీ విడుదలైన వెంటనే తదుపరి సినిమాను పట్టాలెక్కించేందుకు గాను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే నాని తదుపరి సినిమా సుజీత్ దర్శకత్వంలో అనే విషయం కన్ఫర్మ్ అయింది. వీరి కాంబో మూవీకి ఇప్పటికే 'బ్లడీ రోమియో' అనే టైటిల్‌ను ప్రకటించారు. కనుక షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం.
నాని ది ప్యారడైజ్ మూవీతో...
సెప్టెంబర్‌లో 'ది ప్యారడైజ్' సినిమా విడుదల కానుండగా సుజీత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' సినిమాను అక్టోబర్‌లోనే ప్రారంభించాలని నాని భావిస్తున్నాడు. సుజీత్ చాలా కాలం క్రితమే నానితో సినిమాను చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఓజీ విడుదల అయినప్పటి నుంచి బ్లడీ రోమియో సినిమా కోసం సుజీత్ వర్క్ చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కనుక అక్టోబర్‌లో సినిమాను ప్రారంభించి కేవలం ఆరు నెలల్లో సినిమాను పూర్తి చేసి 2027 ఫస్ట్ హాఫ్‌లోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. సుజీత్ సినిమాను అంత స్పీడ్‌గా తీయగలడా అనే అనుమానాలు ఉన్నప్పటికీ నానితో కనుక స్పీడ్‌గా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాని సినిమాల బడ్జెట్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సినిమాలకు ఎక్కువ రోజుల సమయం కేటాయించాల్సి వస్తుంది. కానీ సుజీత్ సినిమాను స్పీడ్‌గా పూర్తి చేయాలని నాని భావిస్తున్నాడట.
నాని, సుజీత్ బ్లడీ రోమియో మూవీ...
సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో సినిమాను చేస్తున్న సమయంలోనే నాని మరో సినిమాను మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో నాని కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుంది. ఎప్పుడైతే బ్లడీ రోమియో పూర్తి అవుతుందో ఫుల్ స్వింగ్‌లో నాని మరో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక 2027లో నాని నుంచి రెండు సినిమాలు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇండస్ట్రీ వర్గాల వారు వచ్చే ఏడాదిలో నాని నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందని బలంగా చెబుతున్నారు. నాలుగు ఏళ్ల తర్వాత నాని నుంచి ఏడాదికి రెండు సినిమాలు వస్తే తప్పకుండా ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి తప్పకుండా కన్నుల పండుగ అనడంలో సందేహం లేదు. అలాగే ఇండస్ట్రీకి కూడా చాలా మంచి జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
