Begin typing your search above and press return to search.

మళ్లీ ఏడాదికి రెండు.. నాని స్పీడ్ పెంచితే..

కానీ కొంతకాలంగా ఆయన సినిమాల విషయంలో లెక్క మారింది. స్టోరీలో సెలక్షన్ తోపాటు సినిమా రేంజ్ కూడా పెరిగింది.

By:  M Prashanth   |   20 Sept 2026 11:13 AM IST
మళ్లీ ఏడాదికి రెండు.. నాని స్పీడ్ పెంచితే..
X

ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలు.. వరుసగా రిలీజ్‌ లు.. బ్యాక్ టు బ్యాక్ హిట్లు.. ఇదే నేచురల్ స్టార్ నాని స్పీడ్. కానీ ఇప్పుడు సినిమా రేంజ్ పెరిగింది. స్టోరీ, స్కేల్, బడ్జెట్ అన్నీ మారడంతో ఒక్కో సినిమాకు ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు. దీంతో ఏడాదికి ఒక సినిమాతోనే నాని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మరి మళ్లీ అదే పాత స్పీడ్‌ లో నాని ఏడాదికి రెండు సినిమాలతో వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తుంటే ఆ ఛాన్స్ కనిపిస్తోంది.

2008లో అష్టా చమ్మాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని.. ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో నటించారు. కెరీర్‌ లో ఒకే ఏడాదిలో హైయెస్ట్ గా మూడు సినిమాలతో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2016లో కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్‌ మన్, మజ్ను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత 2017లో నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ సినిమాలతో వరుసగా సందడి చేశారు. అంటే అప్పట్లో నాని సినిమా స్పీడ్ ఎలా ఉండేదో చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ కొంతకాలంగా ఆయన సినిమాల విషయంలో లెక్క మారింది. స్టోరీలో సెలక్షన్ తోపాటు సినిమా రేంజ్ కూడా పెరిగింది. దసరాతో పాన్ ఇండియా రేంజ్ లోకి వెళ్లిన నాని.. ఆ తర్వాత కూడా తన సినిమాలపై ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. దీంతో ఏడాదికి ఒక మూవీ రావడం కామన్ అయిపోయింది. 2023లో దసరా, హాయ్ నాన్న సినిమాలతో రెండు సార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. 2024లో సరిపోదా శనివారంతో వచ్చారు.

2025లో హిట్: ది థర్డ్ కేస్, ఇప్పుడు 2026లో ది ప్యారడైజ్ తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అంటే ఏడాదికి ఒక్క సినిమా అయినా.. నాని మాత్రం వరుసగా ప్రతి ఏడాది ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసలు విషయం ప్యారడైజ్ తర్వాతే మొదలవుతోంది. ఆ సినిమా తర్వాత నాని చేతిలో ఎక్కువ ప్రాజెక్టులే ఉన్నాయి. ముందుగా సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో త్వరలో ప్రారంభం కానుంది.

ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ సిబి చక్రవర్తితో ఓ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరితో నాని వర్క్ చేయనున్నట్లు సమాచారం. మరికొన్ని చర్చల్లో ఉన్నట్లు వినికిడి. ఇలా వరుసగా మూడు సినిమాలు లైనప్‌ లో ఉండటంతో నాని నెక్ట్స్ రెండు మూడేళ్లు బిజీగా ఉండనున్నారు. అయితే షూటింగ్స్ వేగంగా పూర్తి చేసి రిలీజ్‌ లను ప్లాన్ చేస్తే 2027,2028లో నాని నుంచి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశం కూడా ఉంది.

ఇదే జరిగితే నాని ఫ్యాన్స్ కు పాత రోజులు గుర్తుకు రావడం ఖాయం. ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన నాని.. ఇప్పుడు భారీ కథలు, బిగ్ స్కేల్‌ తో సినిమాలు చేస్తూనే మళ్లీ అదే స్పీడ్ అందుకుంటే మాత్రం ఫ్యాన్స్‌ కు పండగే. మరి ప్యారడైజ్ తర్వాత నాని స్పీడ్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.