Begin typing your search above and press return to search.

స్పెషల్ షో చూసేందుకు సీఎంను అడగాలన్న ఐడియా ఎవరిది నాని?

ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకుంటున్నా.. టికెట్లు దొరకలేదు.. కాస్త సాయం చేయరు? అని సీఎంకు ఎవరైనా పోస్టు పెడితే ఎలా ఉంటుంది? అలానే.. నా సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది.

By:  Garuda Media   |   24 Sept 2026 8:00 AM IST
స్పెషల్ షో చూసేందుకు సీఎంను అడగాలన్న ఐడియా ఎవరిది నాని?
X

ఐపీఎల్ మ్యాచ్ చూడాలనుకుంటున్నా.. టికెట్లు దొరకలేదు.. కాస్త సాయం చేయరు? అని సీఎంకు ఎవరైనా పోస్టు పెడితే ఎలా ఉంటుంది? అలానే.. నా సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది. దాని స్పెషల్ సోను అభిమానులతో కలిసి థియేటర్ లో చూడాలని ఉందని ఒక హీరో నేరుగా ముఖ్యమంత్రిని అభ్యర్థించటం ఎలా ఉంటుంది? చేతి వేళ్ల సాయంతో సోషల్ మీడియాలో మెసేజ్ లు ఇట్టే పెట్టేయొచ్చు. కాకుంటే.. అలాంటివి పబ్లిక్ డొమైన్ లో పోస్టు చేసే వేళలో.. అన్ని వైపులా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఎవరికి తోచింది వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారిని అడగాలన్న ఆలోచన సరైంది కాదు.

తాజాగా అలాంటి తప్పే చేశారు ప్రముఖ హీరో నాని. తన తాజా మూవీ ప్యారడైజ్ స్పెషల్ షోను బుధవారం రాత్రి ప్రదర్శించటం తెలిసిందే. ఫ్యాన్స్ షోను తన అభిమానులతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని థియేటర్ లో చూడాలనుకోవటం బాగానే ఉన్నా.. అందుకు ఎదురయ్యే ఇబ్బందుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవైపు వినాయక నిమజ్జనాలు భారీగా జరగటంతో పాటు.. మహా నిమజ్జనం మరో రెండు రోజుల్లో జరిగే వేళలో.. స్పెషల్ షో వెళ్లేందుకు వీలుగా పర్మిషన్ కోసం అభ్యర్థించటంలో అర్థం లేదు.

హీరో నాని స్థాయి లాంటి నటుడు.. సీఎంను నేరుగా స్పెషల్ షోను ఫ్యాన్స్ తో చూడాలన్న కోరికను వ్యక్తం చేసిన తీరు బాగోలేదనే చెప్పాలి. నిజానికి ఈ తరహా ఐడియాలు ఎవరిస్తుంటారు? అన్నదిప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తే.. పర్మిషన్ వచ్చేస్తుందా? ఒకవేళ వచ్చిందనే అనుకుందాం. దాని కారణంగా నానికి జరిగే లాభం కంటే.. ముఖ్యమంత్రి రేవంత్ కు ఎదురయ్యే ఇబ్బందులే ఎక్కువ. ఒకవేళ.. సానుకూలంగా స్పందిస్తే.. ప్రజల్లో ప్రతికూలత ఎదురయ్యే ప్రమాదం నూటికి నూరుపాళ్లు ఉంటుందన్నది మర్చిపోకూడదు.

అందుకు తగ్గట్లే.. ముఖ్యమంత్రి స్పందన కూడా ఉందని చెప్పాలి. సీఎం రేవంత్ ను హీరో నాని ఎక్స్ వేదికగా కోరగా.. స్పందించిన ముఖ్యమంత్రి.. స్థానిక పోలీసు స్టేషన్ లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచన చేశారు. దీంతో పాటు నగర కొత్వాల్ కు ట్యాగ్ చేశారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ప్రీమియర్ షో చూసేందుకు హీరో నానికి పర్మిషన్ ఇవ్వలేదు. పుష్ప 2 తొక్కిసలాట ఉదంతంలో నగర పోలీసుల మీద తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఈ ఉదంతాన్ని గుర్తు పెట్టుకోవటంతో పాటు... ప్రస్తుతం నగర వ్యాప్తంగా.. అందునా ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలు జరుగుతున్న వేళ.. భారీఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి.

ఒక్క గణేశ్ నిమజ్జనం కోసం హైదరాబాద్ మహానగరంలో 20వేల మంది పోలీసులు పహరా కాస్తున్నారు. ఇలాంటి వేళ.. ఒక హీరో తన తాజా సినిమాకు చెందిన స్పెషల్ షో చూసేందుకు పోలీసులు సెక్యూరిటీ ఏర్పాట్లు చేయటం తప్పే అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. థియేటర్ లో సినిమా చూసేందుకు సీఎం ను ఎక్స్ ద్వారా అడగాలన్న ఐడియా నానికి ఎవరిచ్చారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి చచ్చు.. పుచ్చు ఐడియాలను పక్కన పెట్టేయటం మంచిదన్న హితవు పలువురు చెబుతున్నారు. అభిమానులతో సినిమా చూడాలన్న నాని అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందిస్తే.. జరిగే నష్టంతో పోలిస్తే.. నో చెప్పటం చాలా బెటర్. అదే సమయంలో ఇలా రిజెక్టు అయ్యే అవకాశాలున్న అభ్యర్థలను నాని లాంటి హీరోలు ఎందుకు అడగాలి? అడిగి నో చెప్పించుకోవాలా?