ప్యారడైజ్ ప్రీమియర్.. నాని ప్లాన్‌కు డేట్ చిక్కు!
నాని ది ప్యారడైజ్ ప్రీమియర్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని అనుకున్న ప్లాన్‌కు ఇప్పుడు డేట్ విషయంలో కొత్త సమస్య వచ్చింది.
By: M Prashanth | 23 Sept 2026 1:25 PM ISTనాని ది ప్యారడైజ్ ప్రీమియర్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని అనుకున్న ప్లాన్‌కు ఇప్పుడు డేట్ విషయంలో కొత్త సమస్య వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా లోకల్ పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పగా, ఆ తర్వాత సీవీ ఆనంద్ స్పందించారు. ఆయన రిప్లైలో మాత్రం సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లో పోలీసులకు ఉన్న మరో పెద్ద డ్యూటీని గుర్తు చేశారు.
అదే గణేష్ నిమజ్జనం. ప్రస్తుతం నిమజ్జనాలు జరుగుతుండగా, 23వ తేదీ పదో రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని సీవీ ఆనంద్ చెప్పారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ దగ్గర భారీగా వాహనాలు, జనాలు చేరతారని పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కూడా ఆ రూట్‌కు దగ్గరగా ఉండటంతో అక్కడ ట్రాఫిక్, క్రౌడ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ ప్రభావం రాత్రి వరకు కూడా ఉండొచ్చని చెప్పారు.
నాని థియేటర్‌కు వస్తే అక్కడ కూడా ప్రత్యేకంగా పోలీస్ ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు నిమజ్జనం బందోబస్తు, మరోవైపు స్టార్ హీరో ప్రీమియర్ విజిట్.. రెండింటినీ ఒకేసారి హ్యాండిల్ చేయగలమా అనే విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులతో మాట్లాడాల్సి ఉంటుందని సీవీ ఆనంద్ చెప్పారు. నాని కోరికను అర్థం చేసుకుంటున్నానని చెప్పినా, ఫోర్స్ అందుబాటే ఇక్కడ కీలకంగా మారింది. తన రిప్లైలో ఈ కారణంగానే వెంటనే ఓకే చెప్పలేనని సూచించారు.
దీనికి గత సంధ్య థియేటర్ ఘటన కూడా ఒక కారణం. దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోగా, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడిన విషయాన్ని సీవీ ఆనంద్ తన రిప్లైలో ప్రస్తావించారు. ఆ ఘటన తర్వాత భారీ క్రౌడ్ వచ్చే స్టార్ విజిట్స్‌ను పోలీసులు సాధారణ సినిమా ఈవెంట్‌లా తీసుకునే పరిస్థితి లేదు.
నాని మాత్రం తన రిక్వెస్ట్‌లోనే అన్ని సేఫ్టీ గైడ్‌లైన్స్ పాటిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని అభినందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అధికారికంగా అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ చూసిన తర్వాత అక్కడి టీమ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ అప్లికేషన్‌తో పాటు ఆ రోజు పోలీస్ బందోబస్తు కూడా లెక్కలోకి వచ్చింది.
ప్యారడైజ్ ప్రీమియర్ కోసం నాని సెలెక్ట్ చేసుకున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు సినిమా పరంగా ఎంత క్రేజ్ ఉన్నా, అదే రోజు నగరంలో గణేష్ నిమజ్జనం ఉండటం ప్లాన్‌ను కాస్త కష్టంగా మార్చింది. సీవీ ఆనంద్ హైదరాబాద్ సిటీ పోలీసులతో మాట్లాడతానని చెప్పారు. వాళ్లు అవసరమైన ఫోర్స్‌ను ఏర్పాటు చేయగలమని భావిస్తేనే నాని విజిట్‌కు తదుపరి అడుగు పడే అవకాశం ఉంది. ప్రీమియర్ టైమ్‌కు ముందు పోలీసుల నిర్ణయం రావాల్సి ఉంది.
