Begin typing your search above and press return to search.

ఆ యూఫోరియా మిస్స‌వ్వ‌కండి... ప్రీరిలీజ్‌లో నాని ఎమోష‌న‌ల్ స్పీచ్

నేచురల్ స్టార్ నాని హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన‌ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ `ది ప్యారడైజ్`.

By:  M Prashanth   |   21 Sept 2026 11:04 PM IST
ఆ యూఫోరియా మిస్స‌వ్వ‌కండి... ప్రీరిలీజ్‌లో నాని ఎమోష‌న‌ల్ స్పీచ్
X

నేచురల్ స్టార్ నాని హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన‌ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ `ది ప్యారడైజ్`. ఈనెల 24న ప్యార‌డైజ్ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నాని తనదైన శైలిలో ఎనర్జిటిక్‌గా, భావోద్వేగంగా ప్రసంగించి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ముఖ్యంగా సినిమాపై పెరిగిన‌ అంచనాలు, తారాగణం ప్రత్యేకతల గురించి ఈ వేడుకలో నాని షేర్ చేసిన‌ విశేషాలు సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి.

ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటుల గురించి చెబుతూ.. సోనాలి కులకర్ణి, క‌యాదు స‌హా ఇత‌ర న‌టీనటుల‌ నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని నాని ప్రశంసించారు. అలాగే ఈ చిత్రంలో మోస్ట్ డేంజరస్ విలన్‌గా నటిస్తున్న రాఘవ్ జూయల్ తన పెర్ఫార్మెన్స్‌తో ఇండియన్ సినిమానే షేక్ చేస్తాడని.. అతను క‌చ్చితంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ న‌టుడిగా ఎదుగుతాడని కొనియాడారు. ఇలాంటి విల‌న్ ని చూడ‌లేదు మ‌నం ఎప్పుడూ అనేంత గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చేసాడు. ఇక కాయడు లోహర్ ఈ చిత్రంలో అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని.. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. మరోవైపు లెజెండరీ నటుడు మోహన్ బాబు గారితో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని..ఆయన పాత్ర, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్తాయని అన్నారు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ గురించి చెబుతూ.. ఆయన ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని తెలిపారు. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు థియేటర్లను ఎలా ఊపేస్తాయో చెప్పిన నాని ఈ సినిమా కోసం అనిరుధ్ అందించిన సపోర్ట్ గురించి కూడా ప్రస్తావించారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు, పెయిడ్ షోలతో థియేటర్లు అన్నీ ఊగిపోతాయని.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సినిమా సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నెగెటివిటీపై నాని మాట్లాడిన మాటలు వేదికపై హైలైట్‌గా నిలిచాయి. ``నెగెటివిటీ ఛేజ్ చేసి ఓడిపోయి అలసిపోవాలి... అలసిపోయి ఓడిపోవాలి. నేను గెలుస్తాను అని నమ్మేవాళ్ల కోసం నేను కష్టపడుతూనే ఉంటాను..``అంటూ ఆయన చెప్పిన మాస్ డైలాగ్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. తమను నిరుత్సాహపరచాలని చూసే నెగెటివిటీ ఎప్పటికీ అలసిపోయి ఓడిపోవాల్సిందేనని.. తనను నమ్మి వెన్నంటే ఉండే అభిమానుల కోసమే తాను నిరంతరం కష్టపడుతుంటానని స్పష్టం చేశారు.

ఈ వేడుక ముగింపులో సినిమా విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా చిత్ర షూటింగ్‌కు ..పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భారీ అంచనాల మధ్య రానున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 24న ప్యార‌డైజ్ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది.