ఆ దర్శకుల చెక్కుడుకి ఓటీటీతో చెక్..!
ఓటీటీ నుంచి ఒత్తిడి లేకుంటే కచ్చితంగా ది ప్యారడైజ్ మూవీ నేడు విడుదల అయ్యి ఉండేదే కాదు అనేది ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయం.
By: Ramesh Palla | 24 Sept 2026 5:00 PM ISTనాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' మూవీ నేడు విడుదలైన విషయం తెల్సిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి చివరి నిమిషం వరకు తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. మొదట ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. మరోసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాను వాయిదా వేయించాలని భావించాడని, సినిమాకు సంబంధించిన వర్క్ అనుకున్నట్లుగా పూర్తి కాదనే ఉద్దేశంతో ఆయన సినిమాను మరో నెలన్నర రోజులు వాయిదా వేసి కొత్త విడుదల తేదీని ప్రకటించాలని భావించాడు అనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఓటీటీతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందం కారణంగా ప్రకటించిన తేదీకి విడుదల చేయాల్సి వచ్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఓటీటీ నుంచి ఒత్తిడి లేకుంటే కచ్చితంగా ది ప్యారడైజ్ మూవీ నేడు విడుదల అయ్యి ఉండేదే కాదు అనేది ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయం.
శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ మూవీ...
కేవలం శ్రీకాంత్ ఓదెల మాత్రమే కాకుండా టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు.. ఆ మాటకు వస్తే బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ చాలా మంది దర్శకులు ఔట్‌పుట్ బాగా రావడం కోసం తుది మెరుగులు దిద్దుతూ, షూటింగ్ ఎక్కువ రోజులు తీసుకుంటూ ఉంటారు. వారందరికీ ఇప్పుడు ఓటీటీ వల్ల పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్ సమయంలోనే ఓటీటీ బిజినెస్ చేయాల్సి వస్తుంది. ఓటీటీ బిజినెస్ జరుగుతున్న సమయంలోనే వారు ఒక రిలీజ్ డేట్‌ను ఇస్తారు. కొన్ని సినిమాలకు రెండు మూడు రిలీజ్ డేట్లు ఇస్తారు. వాటికి అనుగుణంగా ఒక తేదీని ఎంపిక చేసుకుని, ఆ తేదీకి విడుదల చేసేందుకు కాపీని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఓటీటీ వారు ఇచ్చిన డేట్‌కి రిలీజ్ చేయలేక పోతే, డీల్ క్యాన్సల్ కావడం లేదంటే, పెట్టిన రేటులో కోత విధించడం చేస్తున్నారు. 25% నుంచి 50% వరకు ఓటీటీ రేటులో కోత విధించిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఓటీటీల ఒప్పందం గురించి...
ఓటీటీ ఒప్పందం సమయంలో ఇచ్చిన డేట్ ప్రకారం సినిమాను విడుదల చేయలేక పోతే కచ్చితంగా నిర్మాతకు పెద్ద నష్టం తప్పదు. అందుకే చివరి నిమిషం వరకు చెక్కిందే మళ్లీ మళ్లీ చెక్కే దర్శకులు విడుదలకు కనీసం వారం ముందే ఫస్ట్ కాపీని రెడీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అనుకున్న సమయం కు దర్శకుడు సినిమాను రెడీ చేయలేకపోతే నిర్మాతకు నష్టం, ఆ నష్టం ను దర్శకుడు తన పారితోషికం నుంచి భర్తీ చేయాల్సి వస్తుంది అనే కండీషన్స్ సైతం ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. అందుకే షూటింగ్‌ను ఆలస్యం చేస్తూ, చేసిందే మళ్లీ మళ్లీ చేస్తూ, ప్లానింగ్ లేకుండా సమయం వృదా చేసే దర్శకులకు ఓటీటీ డీల్ తో చెక్ పెట్టినట్లు అవుతుంది. కచ్చితంగా వారు తమ పాత పద్దతిని వదిలేసి, సినిమాను స్పీడ్‌గా పూర్తి చేయాల్సి వస్తుంది. ఇది నిర్మాతకు రెండు విధాలుగా కలిసి వస్తుందని అనడంలో సందేహం లేదు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి...
నిర్మాతలకు సినిమా షూటింగ్ ఎంత ఆలస్యం అయితే అంత బడ్జెట్ పెరుగుతుంది అనే విషయం తెల్సిందే. అందుకే ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుని, ఒక డేట్‌కు ఫిక్స్ అయ్యి దర్శకుడికి టార్గెట్ పెడితే అప్పటి వరకు సినిమాను పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో నిర్మాత చాలా సేఫ్ అవుతాడు. ఓటీటీ డీల్ కు అనుగుణంగా సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసుకుంటే ఓటీటీ నుంచి వచ్చే అమౌంట్‌తో పాటు, బడ్జెట్ పరిమితిలో ఉంటుంది. దాని వల్ల సినిమా ఫలితం అటు ఇటు అయినా ఎక్కువ నష్టం లేకుండా బయట పడవచ్చు అనేది కొందరి మాట. అందుకే దర్శకులతో స్పీడ్‌గా పని చేయించుకోవడం అనేది నిర్మాతల వల్ల కాలేదు, కానీ ఓటీటీ డీల్ వల్ల అవుతుంది. ఒకరు ఇద్దరు దర్శకులు మినహాయించుకుని టాలీవుడ్‌లో అందరు దర్శకులు తమ కొత్త సినిమాలను ఓటీటీ డీల్‌కు అనుగుణంగా పూర్తి చేసి రిలీజ్ చేయాల్సిందే.
ఆ ఒకరు ఇద్దరు దర్శకులు తమ సినిమాను ఎప్పుడు పూర్తి చేసినా, ఎన్నాళ్లు వాయిదా వేసినా బజ్ పెరుగుతూనే ఉంటుంది. ఓటీటీ వారు వారి సినిమాను కొనుగోలు చేసేందుకు ఎప్పటికీ రెడీగా ఉంటారు. కనుక వారికి ఈ కండీషన్ ఇబ్బంది పెట్టదు. ఉదాహరణకు రాజమౌళి సినిమాకు ఓటీటీ టార్గెట్ ఉండదు, తనకు తాను టార్గెట్ పెట్టుకుని దానికి అనుగుణంగా పూర్తి చేసుకోవడమే ఉంటుంది. ఏ దర్శకుడు అయినా సినిమా మొదలు పెట్టిన సమయంలోనే నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకోవాలి. దాని ప్రకారంగా సినిమాను చేస్తే నిర్మాత సేఫ్, సినిమా అన్ని విధాలుగా సేఫ్.
