Begin typing your search above and press return to search.

ది ప్యారడైజ్.. లెక్క ఎటు పోతోంది?

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రారంభంలో ఈ చిత్రాన్ని వంద కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.

By:  M Prashanth   |   18 Jun 2026 2:09 PM IST
ది ప్యారడైజ్.. లెక్క ఎటు పోతోంది?
X

ఈమధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి వస్తున్న ఆఫర్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవుతోంది. ఫ్యాన్సీ రేట్లకు డిజిటల్ హక్కులు అమ్ముడవుతుండటం నిర్మాతలకు పెద్ద రిలీఫ్ ఇస్తోంది. అయితే ఈ భారీ డీల్స్ వెనుక మేకర్స్ కు నిద్రలేకుండా చేసే కొన్ని కండిషన్స్ కూడా ఉంటున్నాయి. సరిగ్గా ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది.

గతంలో దసరా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలాతో నాని చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఈ ఫోల్క్ యాక్షన్ డ్రామాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మునుపటి సినిమా కంటే భారీ స్థాయిలో అవుట్ పుట్ రావాలనే ఉద్దేశ్యంతో ఆయన దర్శకుడికి బడ్జెట్ విషయంలో పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. క్వాలిటీ కోసం ఎక్కడా రాజీ పడకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్, సెట్స్ తో షూటింగ్ లాగిస్తున్నారు.

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రారంభంలో ఈ చిత్రాన్ని వంద కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ వర్కింగ్ డేస్ పెరుగుతుండటం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఎక్కువ కావడంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. ప్రతిరోజూ లక్షల్లో డబ్బులు ఖర్చవుతుండటంతో ప్రాజెక్ట్ వ్యయం అనుకున్న దానికన్నా ఎక్కువ అవ్వుతుంది. ఇది మిడ్ రేంజ్ లో సినిమాలు తీసే నిర్మాణ సంస్థలకు ఒకరకంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి.

ఈ బడ్జెట్ టెన్షన్ కు తోడు నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ టీమ్ కు మరో తలనొప్పిగా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ తీసుకున్న నెట్ ఫ్లిక్స్ ఒక కఠినమైన రూల్ పెట్టిందట. కరెక్ట్ టైమ్ కు ఫైనల్ కాపీ ఇవ్వకపోతే అగ్రిమెంట్ అమౌంట్ లో భారీగా కోత పడుతుందని కండిషన్ పెట్టినట్లు సమాచారం. అందుకే జూలై కల్లా ఎలాగైనా షూటింగ్ కంప్లీట్ చేయాలని టీమ్ రేయింబవళ్లు కష్టపడుతోంది. తొందరపడితే క్వాలిటీ తగ్గుతుంది, ఆలస్యమైతే ఓటీటీ ఆదాయం పోతుంది.

ఒకవేళ బడ్జెట్ ఇలాగే పెరుక్కుంటూ పోతే థియేట్రికల్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధించడం అంత ఈజీ కాదు. వంద కోట్ల సినిమాకు నూట యాభై కోట్లు వస్తే హిట్ కింద లెక్కేస్తారు. అదే బడ్జెట్ లిమిట్స్ దాటితే బాక్సాఫీస్ దగ్గర కనీసం 200 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. నానికున్న మార్కెట్ ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది. కానీ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలంటే మాత్రం సినిమాకు ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి.

నాని సినిమాపై హైప్ ఉండటం ప్లస్ పాయింట్ అయినా కేవలం ఆ బజ్ తోనే కోట్లు వెనక్కి రావు. పెట్టుబడి రికవరీ అవ్వాలంటే కంటెంట్ లో సాలిడ్ దమ్ముండాలి. నెట్ ఫ్లిక్స్ డీల్ ను సేవ్ చేసుకుంటూనే అనుకున్న టైమ్ కు సినిమాను పూర్తి చేస్తేనే ద ప్యారడైజ్ అందరికీ లాభాలు తెచ్చిపెడుతుంది. లేకపోతే సక్సెస్ అయినా నిర్మాతకు లాభాలు దక్కని ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది.