మన ‘ప్యారడైజ్’కి భయపడ్డ తమిళ క్రేజీ మూవీ..!
నాని హీరోగా రూపొందిన 'ది ప్యారడైజ్' మూవీ విడుదలకు అంతా సిద్ధం అయింది. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా పోటీ లేదు.
By: Ramesh Palla | 19 Sept 2026 1:09 PM ISTనాని హీరోగా రూపొందిన 'ది ప్యారడైజ్' మూవీ విడుదలకు అంతా సిద్ధం అయింది. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా పోటీ లేదు. ఒకటి రెండు చిన్న సినిమాలు వచ్చినా అవి కచ్చితంగా ప్యారడైజ్ ముందు నిలిచే పరిస్థితి లేదని ఇండస్ట్రీ వర్గాల వారు బలంగా నమ్ముతున్నారు. ఈ వారం రోజులు నాని 'ది ప్యారడైజ్' మూవీతో బాక్సాఫీస్ వద్ద దున్నేయడం ఖాయం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్యారడైజ్ నమోదు చేయబోతున్న కలెక్షన్స్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా రికార్డ్‌లు సృష్టించే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్యారడైజ్ మూవీకి కచ్చితంగా పోటీ ఉండే అవకాశం లేదు. కానీ ఇతర భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ సినిమాకు కచ్చితంగా పోటీ గట్టిగా ఉండే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు.
కీర్తి సురేష్ డోరోతి మూవీ...
మొన్నటి వరకు కోలీవుడ్ క్రేజీ మూవీ 'డోరోతి' ను సెప్టెంబర్ 25న విడుదల చేయాలని ఏర్పాట్లు చేశారు. కానీ ఇటీవల నాని చెన్నై వెళ్లి సినిమా కోసం ప్రచారం చేయడం, సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ సినిమా యూనిట్ సభ్యులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో డోరోతి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజు సినిమా కావడంతో డోరోతి పై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించడం, ఇద్దరు హీరోలు నటించడం వల్ల ప్రాజెక్ట్ కి బజ్ క్రియేట్ అయింది. షూటింగ్ పూర్తి చేసి ఇప్పటికే ప్రమోషన్ మొదలు పెట్టారు. ఇంతలో సినిమా విడుదల వాయిదా అంటూ ప్రకటన రావడం ఇండస్ట్రీ వర్గాల వారిని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
నాని ది ప్యారడైజ్ మూవీతో...
కచ్చితంగా నాని ప్యారడైజ్ మూవీకి పోటీ వద్దు అనే ఉద్దేశంతో డోరోతి సినిమాను వాయిదా వేసి ఉంటారు అంటూ తమిళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ది ప్యారడైజ్ మూవీలో కీర్తి సురేష్ కీలకమైన ప్రత్యేక పాటలో నటించిన విషయం తెల్సిందే. కనుక ఈ సినిమా సైతం ఆమెదిగా చెప్పుకుంటున్నారు. పైగా తాను ఇంతకు ముందు చేసిన దసరా సినిమా యూనిట్ కావడంతో ది ప్యారడైజ్ మూవీకి పోటీ వద్దనే ఉద్దేశంతో ఆమె తన డోరోతి మేకర్స్ కి విజ్ఞప్తి చేసి ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతోంది. నాని సినిమాకు తమిళ్ లో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో ది ప్యారడైజ్ మూవీని అక్కడి బయ్యర్లు పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందట. అందుకే ఇప్పుడు డోరోతి విడుదల వాయిదా పడటంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నట్లు తమిళ సోషల్ మీడియా వర్గాల వారు అంటున్నారు.
నాని, శ్రీకాంత్ ఓదెల మూవీ...
ఒక వర్గం మీడియా వారు ది ప్యారడైజ్ మూవీకి భయపడి డోరోతి సినిమాను వాయిదా వేసి ఉంటారు అంటూ కథనాలు రాస్తున్నారు. నాని సినిమాకు ఈ స్థాయి బజ్ రావడం తమిళనాడులో ఇదే మొదటి సారి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ ఆ సినిమాలో ఉండటం వల్లే డోరోతి ని వాయిదా వేయాల్సి వచ్చిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా తమిళనాడులో ది ప్యారడైజ్ మూవీకి పెద్ద పోటీ అనుకున్న మూవీ వాయిదా పడటం కచ్చితంగా కలిసి వచ్చే అవకాశం. ఇక్కడ డోరోతిని విడుదల చేయాలి అంటే థియేటర్ల సమస్య ఉంటుంది. కనుక ఇక్కడ డోరోతికి, అక్కడ ప్యారడైజ్ కి ఈ వాయిదా కలిసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ మూవీతో నాని స్థాయి అమాంతం పెరుగుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.
