మొన్నటి సినిమా బడ్జెట్.. ఈ రోజు నాని రెమ్యునరేషన్!
ఇక్కడ నిర్మాతల ఆదాయం థియేటర్లతో పాటు మరోవైపు కూడా ఉంది. ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్, ఇతర భాషల హక్కులు కూడా ఉన్నాయి.
By: M Prashanth | 19 Sept 2026 8:31 AM ISTనాని కెరీర్‌లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గత 5 ఏళ్లలోనే సినిమాల స్థాయి చాలా మారిపోయింది. ఒకప్పుడు కథ బలంగా ఉంటే సరిపోతుందని, మిడిల్ రేంజ్ బడ్జెట్‌లోనే సినిమాలు చేసేవాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ మాత్రం భారీ నిర్మాణంతో, పాన్ ఇండియా రిలీజ్‌తో వస్తోంది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులే రూ.100 కోట్లకు పైగా వెళ్లినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ ఉంది. ఈ సమయంలో నాని రెమ్యునరేషన్ గురించి కూడా కొత్త టాక్ మొదలైంది.
‘ది ప్యారడైజ్’ కోసం నాని రూ.35 కోట్ల వరకు తీసుకున్నారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది నిజమైతే నాని కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యధిక పారితోషికాల్లో ఇదే ముందుంటుంది. ‘దసరా’ తర్వాత వచ్చిన సినిమాలు, ఓపెనింగ్స్, ఓటీటీ డిమాండ్ అన్నీ కలిసి రెమ్యునరేషన్ పెరగడానికి కారణమయ్యుండొచ్చు. ఒకప్పుడు మొత్తం సినిమా బడ్జెట్ ఉన్న రేంజ్‌కు ఇప్పుడు ఒక్క ఫీజు చేరిందన్న పోలిక హైలెట్ అవుతోంది.
‘దసరా’ తర్వాత ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’తో నాని మార్కెట్ ఒక్కో సినిమాకు పెరిగింది. ఇప్పుడు మళ్లీ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమా కావడంతో ‘ప్యారడైజ్’కు మొదటి నుంచే మంచి బిజినెస్ వచ్చింది. అనిరుధ్ సంగీతం, భారీ సెట్స్, ఇతర భాషల రిలీజ్ కూడా దీనికి తోడయ్యాయి. నైజాం హక్కులు కూడా రూ.35 కోట్ల వరకు వెళ్లినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇక్కడ నిర్మాతల ఆదాయం థియేటర్లతో పాటు మరోవైపు కూడా ఉంది. ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్, ఇతర భాషల హక్కులు కూడా ఉన్నాయి. తెలుగు వెర్షన్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.103 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఓవర్సీస్ హక్కులు రూ.18 కోట్ల వరకు వెళ్లాయని కూడా చెబుతున్నారు. నాని సినిమాకు ఇంత పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈసారి విడుదలకు ముందే మార్కెట్‌లో సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.
సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. సెప్టెంబర్ 23 రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ట్రైలర్ లేకుండానే రిలీజ్‌కు వెళ్తుండటం వల్ల మొదటి షోల తర్వాత వచ్చే టాక్‌కు మరింత ప్రాధాన్యం ఉంటుంది. బుకింగ్స్ ఎలా ఉంటాయి, మొదటి వీకెండ్‌లో ఎంత షేర్ వస్తుంది అన్నది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. భారీ బిజినెస్ జరిగిన సినిమా కావడంతో మొదటి మూడు రోజులు చాలా ముఖ్యం.
ఇప్పుడు ఐదేళ్లు వెనక్కి వెళ్తే మరో పోలిక కనిపిస్తుంది. 2021లో వచ్చిన ‘టక్ జగదీష్’ మొత్తం బడ్జెట్ దాదాపు రూ.34 కోట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సినిమా అమెజాన్ ప్రైమ్‌కు డైరెక్ట్ గా వెళ్లింది. ఇప్పుడు ‘ప్యారడైజ్’ కోసం నాని రూ.35 కోట్ల వరకు తీసుకుంటున్నారనే టాక్ రావడం విశేషం. అప్పటి ఒక సినిమా మొత్తం ఖర్చు ఈరోజు ఒక్క హీరో రెమ్యునరేషన్ దగ్గరకు వచ్చేసింది.
