ప్యారడైజ్ మూవీ.. నాని ఫస్ట్ రెస్పాన్స్ ఇదే..
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ పై హీరో నాని తొలిసారి రెస్పాండ్ అయ్యారు.
By: M Prashanth | 25 Sept 2026 3:12 PM ISTనేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ పై హీరో నాని తొలిసారి రెస్పాండ్ అయ్యారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ప్రశంసలతో పాటు ట్రోల్స్, విమర్శలను తాను రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. సినిమాలోని మిస్టేక్స్ ను క్రిటిక్స్, రివ్యూయర్లు ఎత్తిచూపిన విధానం నుంచి తాను నేర్చుకున్నానని నాని చెప్పడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నాని జడల్ అనే ఊరమాస్ రోల్ లో కనిపించడంతో సినిమాపై హైప్ పెరిగింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఆ మాస్ యాక్షన్ డ్రామాలో నాని పూర్తిగా రస్టిక్ లుక్ లో కనిపించారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు తమకు నచ్చిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు కొన్ని సీన్స్, స్టోరీ, సెకండాఫ్ పై విమర్శలు కూడా చేశారు.
ఆ మొత్తం రెస్పాన్స్ ను నాని అబ్సర్వ్ చేసినట్లు తన పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. "మీ ప్రతి రియాక్షన్, ప్రతి రెస్పాన్స్ చూశాను. మీ ప్రేమను అందుకున్నాను. మీరు చేసిన ఫన్నీ ట్రోల్స్ ను కూడా ఆస్వాదించాను. అదే సమయంలో క్రిటిక్స్, రివ్యూయర్లు సినిమాలోని మిస్టేక్స్ ను చూపించిన విధానం నుంచి నేర్చుకున్నాను" అని నాని తెలిపారు. ప్రేక్షకులు సినిమాను తమదిగా భావించిన విధానం తనను ఎంతగానో హత్తుకుందని చెప్పారు.
ఒక సినిమా విడుదలైన తర్వాత అది పూర్తిగా ప్రేక్షకుల సొంతమవుతుందని, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది వారి డెసిషన్ అన్నట్టుగా తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు నాని. "సినిమా కోసం ఎంతో రక్తం, చెమట చిందించాం. మీకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేశాం. ఇప్పుడు ఆ సినిమా పూర్తిగా మీదే. మీరు దీన్ని సెలబ్రేట్ చేయొచ్చు.. జడ్జ్ కూడా చేయొచ్చు" అని నాని అన్నారు.
సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో కనిపించిన జోష్ న కూడా నాని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో విడుదల తర్వాత తనపై ప్రేక్షకులు చూపించిన ఎఫెక్షన్ తనను థ్యాంక్ ఫుల్ నెస్ తో నింపిందని చెప్పారు. సినిమా గురించి ప్రత్యేకంగా వివరణలు ఇవ్వడం కానీ, వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పడం కానీ చేయకుండా.. ప్రేక్షకుల రెస్పాన్స్ ను గౌరవిస్తూ నాని చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్యారడైజ్ లో నానితో పాటు మోహన్ బాబు, కయాదు లోహర్, ప్రియదర్శి, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. సెకండాఫ్ విషయంలో మాత్రం కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్టోరీ అక్కడక్కడా స్లో అయిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
