Begin typing your search above and press return to search.

నాని, సుజిత్ మూవీ.. షూటింగ్ ముందే రికార్డ్ డీల్!

'ఓజీ' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ విషయంలో ఒక భారీ ఒప్పందం కుదిరిందట.

By:  M Prashanth   |   24 Jan 2026 4:29 PM IST
నాని, సుజిత్ మూవీ.. షూటింగ్ ముందే రికార్డ్ డీల్!
X

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్దే కాదు, డిజిటల్ మార్కెట్‌లోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమా పూర్తికాకముందే ఆయన తన తదుపరి చిత్రం కోసం సంచలన డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'ఓజీ' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ విషయంలో ఒక భారీ ఒప్పందం కుదిరిందట.

సాధారణంగా నాని సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుండి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, నాని సుజిత్ ప్రాజెక్ట్ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని చేస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ ఓటీటీ హక్కులు ఇప్పటికే ఒక రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. అయితే, సుజిత్ సినిమా హక్కులు దాన్ని కూడా మించి, దాదాపు 10 శాతం కంటే ఎక్కువ మార్జిన్‌తో సరికొత్త రికార్డు సృష్టించాయని ఇన్ సైడ్ టాక్.

టైర్ 2 హీరోల సినిమాల్లో ఇదే అత్యధిక ధర అని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రానికి 'బ్లడీ రోమియో' అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. సుజిత్ సినిమాల్లో ఉండే స్టైలిష్ యాక్షన్, నాని మార్క్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. దర్శకుడు సుజిత్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ నుండి నాని ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది.

మొదట ఈ సినిమాను డి.వి.వి. దానయ్య నిర్మించాల్సి ఉంది. అయితే, బడ్జెట్ ఇతర కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, ఇప్పుడు నాని స్వయంగా రంగంలోకి దిగారు. 'శ్యామ్ సింగరాయ్' నిర్మాత వెంకట్ బోయినపల్లితో కలిసి నాని తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా మంచి విజయం సాధించడంతో, ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మరో విశేషమేమిటంటే, ఈ సినిమా సుజిత్ క్రియేట్ చేసిన యూనివర్స్ లో భాగంగా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. అంటే సాహో, ఓజీ చిత్రాలలోని ఎలిమెంట్స్ లేదా క్యారెక్టర్లు ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందన్నమాట. అదే నిజమైతే నాని ఫ్యాన్స్‌కు ఇది ఒక పెద్ద సర్‌ప్రైజ్ అనే చెప్పాలి. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్త కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఏదేమైనా నాని సుజిత్ కాంబో పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది. సినిమా ఇంకా పట్టాలెక్కకముందే బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేయడం నాని క్రేజ్‌కు నిదర్శనం. 'బ్లడీ రోమియో'గా నాని ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.