ఓజీ 2 సరే.. మరి నాని మూవీ సంగతి ఏమైనట్లు?
పవన్ తో తీసిన మూవీ మంచి ఫలితాన్ని అందుకోవడంతో అంతా నానితో సుజీత్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య నాని సైతం త్వరలోనే సుజీత్ తో సినిమా ఉంటుందని ప్రకటించిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 3 July 2026 10:39 AM IST'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుజీత్ మొదటి సినిమా తర్వాత ఏకంగా ఐదు ఏళ్లు సమయం తీసుకుని ప్రభాస్ తో సాహో మూవీ తీసిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత అంతకు మించి గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ తో OG సినిమాలు రూపొందించాడు. సాహో తర్వాత నాని తో సుజీత్ సినిమా అనుకున్నాడు. కథ కూడా దాదాపు ఫైనల్ అయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయం లోనే పవన్ నుంచి పిలుపు రావడంతో నాని సినిమా పక్కన పెట్టి సుజీత్ OG సినిమాను ప్రారంభించాడు. పవన్ తో తీసిన మూవీ మంచి ఫలితాన్ని అందుకోవడంతో అంతా నానితో సుజీత్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య నాని సైతం త్వరలోనే సుజీత్ తో సినిమా ఉంటుందని ప్రకటించిన విషయం తెల్సిందే. కానీ ఇప్పటి వరకు నాని, సుజీత్ కాంబో మూవీ గురించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు.
పవన్ కళ్యాణ్ మూవీ కంటే ముందు నానితో...
నానితో సినిమా విషయం గురించి కాకుండా మళ్లీ పవన్ కళ్యాణ్ తోనే సినిమా ను చేసేందుకు గాను సుజీత్ రెడీ అవుతున్నాడు. ఇటీవలే OG 2 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు కూడా దర్శకుడు సుజీత్ సన్నిహితుల వద్ద చెప్పాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిపాలన, రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సుజీత్ అడిగిన వెంటనే OG సీక్వెల్ కి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ మద్య కాలంలో పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ లుక్ లో చూపించింది కేవలం సుజీత్ మాత్రమే అని అభిమానులు అనుకుంటున్నారు. అందుకే పవన్ మరోసారి సుజీత్ దర్శకత్వంలో చేసేందుకు గాను ఓకే చెప్పడం మాత్రమే కాకుండా నిర్మాతగాను వ్యవహరించేందుకు ముందుకు వచ్చాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
OG 2 సినిమా విషయంలో క్లారిటీ...
పవన్ కళ్యాణ్ తో OG 2 సినిమా ప్రారంభించడం కోసం స్క్రిప్ట్ వర్క్ ను దర్శకుడు సుజీత్ మొదలు పెట్టాడనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు పవన్ తో సినిమాను ప్రారంభించే విధంగా సుజీత్ ప్లాన్ చేస్తున్నాడని ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు నాని తన ప్యారడైజ్ మూవీ పూర్తి అయిన వెంటనే సుజీత్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంతా భావిస్తున్నారు. నానితో సినిమా విషయంలో సుజీత్ ఆసక్తిగా లేడనే పుకార్లు వినిపిస్తున్నాయి. నాని గతంలో చేసిన వ్యాఖ్యల అనుసారం సుజీత్ ఎప్పుడు అంటే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ సుజీత్ మాత్రం మళ్లీ పవన్ వెంట పడుతున్నాడు. ఇంతకు ముందు పవన్ నుంచి పిలుపు వచ్చింది కనుక తన సినిమా వల్ల ఇబ్బంది కలుగకూడదు అనే ఉద్దేశంతో నాని వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు OG 2 విషయమై నాని ఎలా రియాక్ట్ అవుతాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నాని, సుజీత్ కాంబో మూవీ ఎప్పుడో...
నాని, సుజీత్ కాంబో మూవీ గురించి దాదాపు అయిదు ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. సాహో విడుదల తర్వాత సుజీత్ కొంత మంది హీరోలకు కథలు వినిపించాడట, కానీ నాని మాత్రమే ఓకే చెప్పాడని, అందుకే నానితో సుజీత్ సినిమాకు సిద్ధం అయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎవరూ ఛాన్స్ ఇవ్వని సమయంలో నాని అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అలాంటి నానికి సుజీత్ ఖచ్చితంగా గౌరవం ఇచ్చి సినిమా చేసి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి సుజీత్ మాత్రం పవన్ కళ్యాణ్ తో మరోసారి అంటున్నాడు. సీక్వెల్ కంటే ముందే నానితో సుజీత్ సినిమా చేయడం కరెక్ట్ అని, ఇప్పటికే నాని చాలా కాలం సుజీత్ కు సమయం ఇచ్చాడని, ఆ సమయం సద్వినియోగం చేసుకుని, నానికి గౌరవం ఇచ్చి సుజీత్ సినిమాను మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి నాని సినిమా గురించి సుజీత్ అభిప్రాయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
