నాని లైనప్.. ఆ గ్యాప్ ఫిల్ చేసే మూవీ ఏది?
నేచురల్ స్టార్ నాని సినిమాలకు కలెక్షన్లు రావడం కొత్త విషయం కాదు. సినిమా హిట్ అవ్వడం కూడా కొత్త కాదు. కానీ ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ కు కావాల్సింది మాత్రం ఇంకొంచెం ఎక్కువ
By: M Prashanth | 5 Oct 2026 1:03 PM ISTనేచురల్ స్టార్ నాని సినిమాలకు కలెక్షన్లు రావడం కొత్త విషయం కాదు. సినిమా హిట్ అవ్వడం కూడా కొత్త కాదు. కానీ ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ కు కావాల్సింది మాత్రం ఇంకొంచెం ఎక్కువ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ సినిమా అదిరిపోయిందని చెప్పే ఆ ఒక్క క్లియర్ హిట్. అదే ఇప్పుడు నాని లైనప్ ముందు ఉన్న అసలు టార్గెట్ లా కనిపిస్తోంది.
ఒకప్పుడు నాని సినిమా అంటే కంటెంట్ పై గట్టి నమ్మకం ఉండేది. ఈగ, భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, జెర్సీ.. ఇలా ఒక్కో సినిమా ఒక్కో జోన్ లో నానిని చూపించాయి. కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో పాటు టాక్ విషయంలోనూ స్ట్రాంగ్ ముద్ర వేశాయి. 2023లో దసరాతో నాని మాస్ మార్కెట్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న పూర్తిగా భిన్నమైన సినిమాగా వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
ఆ రెండు సినిమాలు నాని కెరీర్ లో మంచి టాక్ తో గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి. కానీ ఆ తర్వాత లెక్క కాస్త మారింది. సరిపోదా శనివారం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. నాని మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మరోసారి చూపించింది. అయితే కంటెంట్ విషయంలో మాత్రం అందరి నుంచి ఒకే రకమైన రెస్పాన్స్ రాలేదు. ఇక ప్యారడైజ్ దగ్గరికి వచ్చేసరికి నాని మార్కెట్ ఇంకోసారి కనిపించింది.
భారీ ఓపెనింగ్స్.. భారీ వసూళ్లు.. నాని కెరీర్ లోనే పెద్ద కమర్షియల్ నంబర్స్. కానీ సినిమాపై వచ్చిన టాక్ మాత్రం అంత ఒకేలా లేదు. అంటే నాని స్టార్ పవర్ కు డౌట్ లేదు.. కానీ ఆ స్టార్ పవర్ కు సరిపోయే కంటెంట్ కోసం వెతుకులాట కొనసాగుతూనే ఉంది. ఇదే ఇప్పుడు నాని ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే ముందున్న లైనప్ మామూలుగా లేదు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్లడీ రోమియోపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ ఉంది.
ది ప్యారడైజ్ లో చూసిన నానికి పూర్తి భిన్నమైన లుక్, స్టైల్ లో కనిపించబోతున్నారనే టాక్ ఉంది. యాక్షన్ తో పాటు స్టైలిష్ ట్రీట్మెంట్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు వెంకీ అట్లూరితో సినిమా, శివ నిర్వాణతో మరోసారి కాంబినేషన్.. ఇవి కూడా నాని కెరీర్ లో ఇంట్రెస్టింగ్ గా ప్రాజెక్టులుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శివ నిర్వాణతో నాని అంటే నిన్ను కోరి కాంబినేషన్ గుర్తుకు వస్తుంది.
ఆ కాంబినేషన్ మళ్లీ క్లిక్ అయితే నాని కోరుకుంటున్న ఆ ఫీల్ గుడ్ హిట్ దొరికే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు నానికి కావాల్సింది మరో కమర్షియల్ హిట్ మాత్రమే కాదు. వసూళ్లు కూడా రావాలి.. టాక్ కూడా రావాలి.. సినిమా అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ ఇదే నాని సినిమా అని ఫీలయ్యేలా ఉండాలి. ఆ గ్యాప్ ను బ్లడీ రోమియో ఫిల్ చేస్తుందా.. లేక తర్వాత వచ్చే సినిమాల్లో ఏదైనా ఆ మ్యాజిక్ చేస్తుందా అనేది చూడాలి.
