ది ప్యారడైజ్‌కు అసలు బీజం అప్పుడే! నాని ఓకే చెప్పడానికి కారణం ఇదే!
అయితే ఈ సినిమా అసలు పునాది పడింది ఎప్పుడు? అనే ప్రశ్నకు ఇప్పుడు నాని చెప్పిన ఓ ఆసక్తికరమైన విషయం సమాధానంగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 18 Sept 2026 1:28 PM ISTటాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆసక్తిని పెంచుతాయి. అలాంటి కాంబినేషన్లలో నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల జోడీ ఒకటి. దసరాతో ఇద్దరూ కలిసి భారీ సక్సెస్ ను అందుకున్న తర్వాత మరోసారి చేతులు కలపడంతో ది ప్యారడైజ్ పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా అసలు పునాది పడింది ఎప్పుడు? అనే ప్రశ్నకు ఇప్పుడు నాని చెప్పిన ఓ ఆసక్తికరమైన విషయం సమాధానంగా మారింది.
దసరా సక్సెస్ తర్వాత శ్రీకాంత్ ఓదెల మరో సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లో తనను కలిసినట్టు నాని చెప్పారు. అప్పటికి శ్రీకాంత్ తన మొదటి సినిమాకు సంబంధించిన ఎక్స్‌పీరియెన్స్‌ను పూర్తిగా విశ్లేషించుకుంటున్న దశలో ఉన్నాడని, తాను చేసిన కొన్ని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, తర్వాతి సినిమాతో వాటిని సరిదిద్దుకుని మరింత స్ట్రాంగ్ స్టోరీని చెప్పాలనే పట్టుదలతో ఉన్నట్లు తనతో చెప్పాడని నాని చెప్పారు. ఆ టైమ్ లోనే శ్రీకాంత్ దగ్గరున్న కొత్త ఆలోచనను తనతో చెప్పినట్టు నాని వెల్లడించారు.
ఇక్కడే ది ప్యారడైజ్ జర్నీలో కీలకమైన మలుపు కనిపిస్తుంది. సాధారణంగా ఒక హీరో కథ పూర్తిగా రెడీ అయిన తర్వాతే సినిమా చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకుంటాడు. కానీ నాని విషయంలో మాత్రం కథ పూర్తిగా రెడీ అవకముందే డైరెక్టర్ ఆలోచన, అతని విజన్‌పై నమ్మకం ఏర్పడినట్లు తెలుస్తోంది. కథ ఇంకా పూర్తి కాలేదు, కానీ శ్రీకాంత్ ఈసారి మరింత భారీ స్థాయిలో ఏదో చేయబోతున్నాడనే నమ్మకం అప్పుడే కలిగిందని నాని చెప్పడం ఈ కాంబినేషన్‌లో ఉన్న ప్రత్యేకతను బయటపెడుతోంది.
దీన్ని బట్టి చూస్తే ది ప్యారడైజ్ కేవలం దసరా సక్సెస్ తర్వాత వచ్చిన మరో సినిమా కాదని అర్థమవుతుంది. ఒక డైరెక్టర్ తన తొలి ప్రయాణంలోని అనుభవాలను తీసుకుని తర్వాతి అడుగు ఎలా వేయాలనుకుంటున్నాడో విన్న హీరో, దానిపై నమ్మకం పెట్టుకుని ముందుకు సాగిన ప్రాజెక్ట్ గా ది ప్యారడైజ్ ను చూడొచ్చు. అదే నమ్మకం తర్వాత కథ, పాత్రలు, టెక్నికల్ అంశాలు ఇలా ఒక్కొక్కటిగా రూపుదిద్దుకున్నాయి.
దాదాపు రెండు నుంచి మూడేళ్ల ప్రయాణం తర్వాత ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో, నాని నమ్మిన శ్రీకాంత్ ఓదెల విజన్ తెరపై ఏ స్థాయిలో కనిపించబోతోందన్నదే ఇప్పుడు అసలు ఆసక్తిగా మారింది. కథ పూర్తయ్యేలోపే హీరోను ఒప్పించిన ఆ నమ్మకం.. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
