Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ నాని మూడు..శివకార్తికేయన్ ఐదు!

నేచుర‌ల్ స్టార్ నాని, కోలీవుడ్ హీరో శివ‌కార్తికేయ‌న్ ఇద్ద‌రిదీ బ్యాగ్రౌండ్ లేని ప్ర‌యాణ‌మే.

By:  Tupaki Entertainment Desk   |   22 Jan 2026 12:43 PM IST
నేచుర‌ల్ స్టార్ నాని మూడు..శివకార్తికేయన్ ఐదు!
X

నేచుర‌ల్ స్టార్ నాని, కోలీవుడ్ హీరో శివ‌కార్తికేయ‌న్ ఇద్ద‌రిదీ బ్యాగ్రౌండ్ లేని ప్ర‌యాణ‌మే. ఇండ‌స్ట్రీలో వీరికంటూ ఎవ‌రూ లేరు. అయినా స‌రే త‌మ టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగారు. స్టార్ హీరోల స‌ర‌స‌న నిల‌బ‌డుతున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేస్తే శివ కార్తికేయ‌న్ టీవీ యాంక‌ర్‌గా, షో ప్ర‌జెంట‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు. నాని 2008లో వ‌చ్చిన `అష్టాచ‌మ్మా` సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తే శివ కార్తికేయ‌న్ `మెరీనా` మూవీతో 2012లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ ఇద్ద‌రూ అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టుగా కోటి రెండు కోట్ల బ‌డ్జెట్ సినిమాల నుంచి ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద రూ.100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌గ‌ల హీరోలా స్థాయికి ఎదిగి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. నాని హీరోగా న‌టించిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్నాయి. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు మాస్ ప్రేక్ష‌కుల్లోనూ వీరి సినిమాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డ‌టంతో అవి రూ.100 కోట్లు కొల్ల‌గొడుతున్నాయి.

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన మూడు సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు వంద కోట్ల క్ల‌బ్‌లో చేరాయి. `ద‌స‌రా` మూవీ నాని సినిమాల్లో తొలిసారి రూ.100 కోట్ల మార్కుని దాటింది. ఆ త‌రువాత అదే ఊపుని కొన‌సాగించిన `స‌రిపోదా శ‌నివారం`, హిట్ ద థ‌ర్డ్ కేస్ చిత్రాలు వంద కోట్లు రాబ‌ట్టి నాని సినిమాల్లో వంద కోట్లు సాధించాయి. ఇక శివ‌కార్తికేయ‌న్ మాత్రం నానికి మించే వంద కోట్ల సినిమాల‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. నాని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాల‌తో వంద కోట్ల క్ల‌బ్‌లో చేరితే శివ కార్తికేయన్ ఈ క్ల‌బ్‌లో చేరిన ఐదు సినిమాల‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన `డాక్ట‌ర్` మూవీ శివ‌కార్తికేయ‌న్ కు హీరోగా, ప్రొడ్యూస‌ర్‌గా మంచి పేరు తెచ్చి పెట్టిన విష‌యం తెలిసిందే. 2021లో రూ.25 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.100 కోట్ల మార్కుని చేరుకుని శివ కార్తికేయ‌న్ కెరీర్‌లో తొలి వంద కోట్లు రాబ‌ట్టిన సినిమాగా రికార్డు సాధించింది. దీని త‌రువాత లైకాతో క‌లిసి శివ కార్తికేయ‌న్ నిర్మాత‌గా చేసిన `డాన్‌` కూడా ఇదే ఫీట్‌ని రిపీట్ చేసింది. ఈ మూవీ రూ.120 కోట్లు రాబ‌ట్ట‌డం విశేషం.

మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ రియ‌ల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెర‌కెక్కిన 2024లో క‌మ‌ల్ ప్రొడ్యూస్ చేసిన `అమ‌ర‌న్‌`లో శివ కార్తికేయ‌న్ న‌టించిన విష‌యం తెలిసిందే. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ బ‌యోగ్రాఫిక‌ల్ యాక్ష‌న్ వార్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించింది. రియ‌ల్ హీరో స్టోరీ కావ‌డంతో ప్రేక్ష‌కులు ఐదు భాష‌ల్లోనూ ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.. ఫ‌లితంగా బాక్సాఫీస్ వ‌ద్ద `అమ‌ర‌న్‌` రూ.341 కోట్లు రాబ‌ట్టి శివ కార్తికేయ‌న్ సినిమాల్లో స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఇక 2025లో ఏ.ఆర్‌. మురుగ‌దాస్ డైరెక్ట్ చేసిన `మ‌ద‌రాసి` కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కానీ రూ.100 రాబ‌ట్టంది. 2026, జ‌న‌వ‌రి 10న విడుద‌లై `ప‌రాశ‌క్తి` తాజాగా రూ.100 కోట్ల మార్కుని తాక‌డంతో త‌న‌ కెరీర్‌లో ఐదు వంద కోట్ల మార్కుని దాటిన సినిమాల‌ని సొంతం చేసుకున్న హీరోగా శివ కార్తికేయ‌న్ రికార్డు సాథించాడు.