Begin typing your search above and press return to search.

బయట కనిపించేది కాదు.. మోహన్ బాబు అసలు స్వరూపం ఇదేనా?

మోహన్ బాబుతో కలిసి ది ప్యారడైజ్‌లో నటించిన నాని.. ఆయన గురించి తనకున్న అభిప్రాయం ఎలా మారిందో ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Sept 2026 11:57 AM IST
బయట కనిపించేది కాదు.. మోహన్ బాబు అసలు స్వరూపం ఇదేనా?
X

మోహన్ బాబు పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మదిలో ఒక స్పెష‌ల్ ఇమేజ్ మెదులుతుంది. దశాబ్దాల సినీ ప్రయాణం, విలక్షణమైన నటన, తనదైన మాట తీరు, గంభీరమైన వ్యక్తిత్వం.. ఇవన్నీ కలిసి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. అయితే ఒక వ్యక్తి గురించి బయట నుంచి ఏర్పడే అభిప్రాయం వేరు.. అతనితో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత కలిగే అనుభూతి వేరు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని మాటల్లో ఇదే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మోహన్ బాబుతో కలిసి ది ప్యారడైజ్‌లో నటించిన నాని.. ఆయన గురించి తనకున్న అభిప్రాయం ఎలా మారిందో ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు గురించి అంద‌రూ బ‌య‌ట చెప్పుకునేదాన్ని మ‌న‌సులో పెట్టుకుని ఆయనతో మాట్లాడటం అంత ఈజీ కాదేమో అనే భావన కలగొచ్చని నాని పేర్కొన్నారు. కానీ ఆ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఆయనతో కేవలం పది నిమిషాలు సరిగ్గా మాట్లాడితే మాత్రం పూర్తిగా మరో వ్యక్తి కనిపిస్తారని చెప్పారు. అప్పటివరకు మనసులో ఉన్న అంచనాలు ఒక్కసారిగా మారిపోతాయని, ఈయన కూడా మనలాగే ఉన్నారు కదా.. మరి ఇలాంటి ఇమేజ్ ఎలా వచ్చింది? అనిపిస్తుందని నాని చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా మోహన్ బాబులోని చిన్నపిల్లాడి మనస్తత్వం తనను బాగా ఆకట్టుకుందని నాని వెల్లడించారు.

అంతేకాదు, ఆయ‌న‌కు ఎవరైనా నచ్చితే ఆ విషయాన్ని తనలోనే దాచుకునే వ్యక్తి కాదని నాని వెల్ల‌డించారు. ఆ వ్యక్తి గురించి కుటుంబ సభ్యులతోనే కాకుండా సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరితోనూ చెప్పుకుంటుంటారని నాని తెలిపారు. అంతేకాదు, నాని తనకు నచ్చాడని, ఈ మధ్యకాలంలో బాగా కనెక్ట్ అయిన వ్యక్తి అని మోహన్ బాబు పదేపదే చెప్పుకోవడం కూడా నానికి చాలా స్పెష‌ల్ గా అనిపించిందట. స్టార్‌డమ్ కంటే వ్యక్తులతో ఏర్పడే అనుబంధానికి మోహ‌న్ బాబు ఎంత విలువ ఇస్తారో ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది.

ఒకవైపు ఆడియ‌న్స్ కు కనిపించే మోహన్ బాబు.. మరోవైపు తనకు దగ్గరైన వారితో కనిపించే మోహన్ బాబు. ఈ రెండు కోణాల మధ్య ఉన్న వ్యత్యాసాన్నే నాని మాటలు బయటపెడుతున్నాయి. నిజానికి కొన్ని పరిచయాలు సినిమా పూర్తైన‌ తర్వాత కూడా గుర్తుండిపోతాయి. ది ప్యారడైజ్ నానికి అలాంటి పరిచయాన్ని ఇచ్చిన సినిమాగా నిలుస్తుంద‌ని నాని మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ముందు సినిమా గురించి మాత్రమే కాకుండా, సినిమాలో భాగమైన ఇద్దరు నటుల మధ్య ఏర్పడిన ఈ అనుబంధం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.