Begin typing your search above and press return to search.

జడల్ వెనుక నాని కష్టం ఎంతంటే..

ప్యారడైజ్‌లో నాని జడల్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ హెయిర్ స్టైల్ బాగా హైలెట్ అయింది. పోస్టర్లలో కూడా అదే క్యారెక్టర్‌కు మంచి బజ్ క్రియేట్ చేసింది.

By:  M Prashanth   |   11 Sept 2026 9:49 PM IST
జడల్ వెనుక నాని కష్టం ఎంతంటే..
X

ప్యారడైజ్‌లో నాని జడల్ లుక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ హెయిర్ స్టైల్ బాగా హైలెట్ అయింది. పోస్టర్లలో కూడా అదే క్యారెక్టర్‌కు మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ షూటింగ్‌లో మాత్రం ఆ జడలతో నానికి చాలా ఇబ్బందులు వచ్చాయని లేటెస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ సమయంలో తలకు ఎక్కువ ఒత్తిడి పడేదని, కొన్ని సందర్భాల్లో గాయాలు కూడా అయ్యాయని వివరించారు.

ఆ జడల బరువు దాదాపు ఆరు కేజీల వరకు ఫీల్ అయ్యేలా ఉంటుందనీ ఇదివరకే రకరకాల కామెంట్స్ వచ్చాయి. మామూలు విగ్‌లా పెట్టి తీసేసేలా కాకుండా, వాటిని జుట్టుకు క్లిప్స్‌తో గట్టిగా ఫిక్స్ చేస్తారట. తల కొంచెం కదిలినా ఆ బరువు మొత్తం జుట్టుపైనే పడేదని చెప్పారు. జడలను పూర్తిగా విప్పితే ఒక పెద్ద పొదలా కనిపిస్తాయని కూడా ఆయన సరదాగా వివరించారు.

అసలు ఇబ్బంది రోప్ యాక్షన్ దగ్గర ఎక్కువైందట. ఫైట్స్‌లో రోప్స్‌తో పైకి లేపినప్పుడు జడలు వాటిలో ఇరుక్కుపోయేవని నాని చెప్పారు. ఒకవైపు రోప్ శరీరాన్ని లాగుతుంటే, మరోవైపు జడల బరువు తలను వెనక్కి లాగేదట. కొన్ని షాట్స్ తర్వాత తల దగ్గర గాయాలు కూడా అయ్యాయని బయటపెట్టారు. లుక్ మార్చకుండా ఫైట్స్ చేయాల్సి రావడంతో ప్రతి షాట్ ముందు జడలు రోప్స్‌కు తగలకుండా చూసుకోవాల్సి వచ్చేదట.

కొరియోగ్రాఫర్ జడల బరువు గురించి మాట్లాడటానికి కూడా ఇదే కారణమని నాని చెప్పారు. సెట్‌లో తాను పడుతున్న ఇబ్బందిని దగ్గరగా చూసి కేరింగ్‌తో ఆ విషయం చెప్పారని క్లారిటీ ఇచ్చారు. సినిమా కోసం హీరోలు ఇలాంటి కష్టాలు పడటం సహజమేనని కూడా అన్నారు. ప్రేక్షకులకు సినిమా నచ్చితే ఇలాంటి కష్టాలన్నీ వెంటనే మర్చిపోతామని నాని చివరగా చెప్పారు.

ఇదే ప్రెస్ మీట్‌లో సోషల్ మీడియాలో తిరిగిన మరికొన్ని రూమర్లపైనా నాని స్పందించారు. సినిమాలో భారీ అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందని, వెయ్యి మందితో ఒక ఫైట్ తీశారని, షూటింగ్ సమయంలో దర్శకుడు కోపంతో ఎవరో ఒకరిని కొట్టాడని వచ్చిన వార్తలను ఆయన నవ్వుతూ కొట్టిపారేశారు. ప్యారడైజ్ ఒక జెన్యూన్ కథతో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ సినిమా అని మాత్రమే చెప్పారు.

సెప్టెంబర్ 24 రిలీజ్‌కు సిద్ధమవుతున్న ప్యారడైజ్ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ మీద టీమ్ పని చేస్తోంది. ట్రైలర్ కోసం నాలుగు రోజులు విడిగా పెట్టకుండా ఆ సమయాన్ని కూడా సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌కే ఉపయోగించాలని నిర్ణయించినట్లు నాని మరో సందర్భంలో చెప్పారు. ఇప్పుడు రిలీజ్‌కు ముందు వచ్చే మిగతా ప్రమోషనల్ కంటెంట్‌లో జడల్ యాక్షన్ ఎంత వరకు చూపిస్తారన్నది చూడాలి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జడల్ కథ ఒక అణగదొక్కబడిన సంచార జాతి చుట్టూ తిరుగుతుందని దర్శకుడు చెప్పారు. తల్లి, కొడుకు ఎమోషన్ కూడా కథలో ఉందని వెల్లడించారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.