Begin typing your search above and press return to search.

క్రాస్ రోడ్స్ ప్లాన్.. కుదరకపోతే స్కిప్ చేస్తాం!

ది ప్యారడైజ్ ప్రీమియర్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని నాని పెట్టుకున్న ప్లాన్ ఇప్పుడు పోలీసుల నిర్ణయం దగ్గరకు వచ్చింది.

By:  M Prashanth   |   23 Sept 2026 1:33 PM IST
క్రాస్ రోడ్స్ ప్లాన్.. కుదరకపోతే స్కిప్ చేస్తాం!
X

ది ప్యారడైజ్ ప్రీమియర్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని నాని పెట్టుకున్న ప్లాన్ ఇప్పుడు పోలీసుల నిర్ణయం దగ్గరకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్‌కు అప్లికేషన్ ఇవ్వాలని సూచించగా, సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనం బందోబస్తు గురించి గుర్తు చేశారు. ఈ రెండు రిప్లైలు వచ్చిన తర్వాత నాని కూడా మరో పోస్ట్ పెట్టారు. ఈసారి తన కోరిక కంటే పోలీసుల నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తానని క్లియర్ చేశారు.

ముందుగా సీఎం రేవంత్ రెడ్డి త్వరగా స్పందించినందుకు నాని ధన్యవాదాలు చెప్పారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల మధ్య పబ్లిక్ సేఫ్టీ ఎంత ముఖ్యమో తమకు పూర్తిగా అర్థమవుతుందని రాశారు. తన థియేటర్ విజిట్ కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై అదనపు భారం పడకూడదని, ఇప్పటికే జరుగుతున్న ఏర్పాట్లకు ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని కూడా పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీని కూడా ట్యాగ్ చేశారు.

అక్కడితో ఆగకుండా విజిట్ గురించి కూడా నాని ఓపెన్‌గా చెప్పారు. సేఫ్టీ లేదా క్రౌడ్ మేనేజ్‌మెంట్ విషయంలో ఏ సమస్య ఉన్నా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వెళ్లే ప్లాన్‌ను వదులుకోవడానికి సిద్ధమేనని అన్నారు. పోలీసుల చివరి నిర్ణయం ఏదైనా దాన్ని ఫాలో అవుతామని చెప్పారు. అవసరమైతే ప్రీమియర్‌కు వెళ్లకుండా ఉండటంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని నాని స్పష్టం చేశారు.

నిజానికి నాని మొదటి రిక్వెస్ట్‌లోనే అన్ని సేఫ్టీ గైడ్‌లైన్స్ పాటిస్తామని చెప్పారు. కానీ సెప్టెంబర్ 23న గణేష్ నిమజ్జనం పదో రోజు కావడం ఇక్కడ అసలు చిక్కు. హుస్సేన్ సాగర్‌తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసరాల్లో భారీగా జనాలు, వాహనాలు ఉంటాయని సీవీ ఆనంద్ చెప్పారు. అదే సమయంలో నాని విజిట్ ఉంటే అదనంగా పోలీస్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది.

దీనికి తోడు గత సంధ్య థియేటర్ ఘటనను కూడా సీవీ ఆనంద్ తన రిప్లైలో ప్రస్తావించారు. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోగా, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటన తర్వాత స్టార్ హీరోల థియేటర్ విజిట్స్ విషయంలో పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే హైదరాబాద్ సిటీ పోలీసులతో మాట్లాడి, అవసరమైన ఫోర్స్ అందుబాటులో ఉందో లేదో చూసిన తర్వాతే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న విడుదల కానుండగా, ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు ఉన్నాయి. నాని మొదట కోరుకున్నది ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూడటమే. ఇప్పుడు మాత్రం ఆ ప్లాన్ కోసం పోలీసులపై ఒత్తిడి పెట్టబోమని ఆయనే చెప్పేశారు. అప్లికేషన్ వెళ్లిన తర్వాత సిటీ పోలీసులు ఓకే అంటే విజిట్ ఉంటుంది. క్రౌడ్ మేనేజ్‌మెంట్ కష్టమని భావిస్తే నాని ఆ ప్లాన్‌ను అక్కడితో వదిలేస్తారని తెలుస్తోంది.