పాన్-ఇండియా ట్యాగ్‌పై నాని అసహనం.. సౌత్ సినిమాలకే ఆ ముద్ర ఎందుకు?
తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని పాన్-ఇండియా అనే పదంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By: Srikanth Kontham | 18 Sept 2026 5:00 PM ISTతెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని పాన్-ఇండియా అనే పదంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాని నటించిన `ది పారడైజ్` ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాని పాన్-ఇండియా ట్యాగ్‌ను తాను ఏమాత్రం ఇష్టపడనని స్పష్టం చేశారు. దక్షిణాది సినిమాలకు మాత్రమే ఈ పదాన్ని ఎందుకు పరిమితం చేస్తున్నారో? తనకు అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు. హిందీలో తెరకెక్కిన జవాన్ , పఠాన్ వంటి సినిమాలు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ విజయం సాధించినప్పటికీ వాటిని ఎవరూ పాన్-ఇండియా సినిమాలు అని పిలవరని.. కేవలం హిందీ సినిమాలు' అని మాత్రమే వ్యవహరిస్తారని గుర్తుచేశారు.
అదే తెలుగు లేదా దక్షిణాది సినిమా దేశవ్యాప్తంగా విజయం సాధిస్తే మాత్రం దానికి పాన్-ఇండియా సినిమా అనే ట్యాగ్ తగిలిస్తున్నారని ఈ వ్యత్యాసం సరికాదని పేర్కొన్నారు. తన సినిమాలను పాన్-ఇండియా అని పిలవద్దని మీడియాను .. అభిమానులను కోరారు. `ప్రజలు ఈ పదాన్ని ఉపయోగించకుండా నేను పూర్తిగా ఆపలేకపోవచ్చు. కానీ నా సినిమాలకు ఆ ట్యాగ్‌లు తగిలించవద్దని మాత్రమే అభ్యర్థించగలను` అని తెలిపారు.
తన సినిమాలను తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులకు చేరువ చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని.. అయితే అందుకోసం ఎలాంటి ట్యాగ్‌లు అవసరం లేదని నాని తేల్చిచెప్పారు. గత దశాబ్దంలో `బాహుబలి`, `కేజీఎఫ్`, `పుష్ప` వంటి చిత్రాలు ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద సాధించిన అపూర్వ విజయాల తర్వాతే పాన్-ఇండియా అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అనేక మంది దక్షిణాది నిర్మాతలు బాలీవుడ్ నటులను తమ సినిమాల్లోకి తీసుకుంటూ పాన్-ఇండియా చిత్రాలను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే హిందీ చిత్రాలైన `జవాన్`, `యానిమల్` వంటివి దక్షిణాదిలో భారీ వసూళ్లు సాధించినా? వాటికి పాన్-ఇండియా ముద్ర వేయకపోవడం గమనార్హం. మొత్తానికి నాని వ్యాఖ్యలను బట్టి అతడికి తన సినిమాలను పాన్ ఇండియా అనడం ఎంత మాత్రం ఇష్టం లేదన్నది క్లియర్. తాను ఏ సినిమా చేసినా? ఎన్ని భాషల్లో రిలీజ్ అయినా? అంతిమంగా హిట్ అయితే చాలు అన్న కాన్సెప్ట్ లో నాని కనిపిస్తున్నారు. ఇమేజ్ అన్న దానికి పేరు పెట్టాల్సిన పనిలేదని....విజయాలు వస్తే ఇమేజ్ దానంతట అదే దేశ వ్యాప్తంగా రెట్టింపు అవుతుందన్నది నాని బలమైన నమ్మకంగా కనిపిస్తుంది.
