నితిన్ సినిమా కోసం నాని.. ప్రమోషన్స్ లో కూడా ఇలా..
నితిన్ కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’ ప్రమోషన్లలో నాని ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా మూవీ టీమ్‌తో కలిసి మ్యూజిక్ జామ్ పార్టీకి హాజరయ్యారు. ఇప్పటికే విడుదలైన ‘రుక్కు రుక్కు రుక్మిణి’ తర్వాత ‘పిచ్చి ప్రేమలో’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: M Prashanth | 14 Nov 2026 9:51 PM ISTనార్మల్ గా ఒక హీరో మరో హీరో సినిమాకు సపోర్ట్ చేయాలంటే ట్రైలర్ రిలీజ్ చేయడం, ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావడం చూస్తుంటాం. కానీ నాని మాత్రం నితిన్ కొత్త సినిమా విషయంలో అంతకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. సినిమా ప్రకటన నుంచే ప్రమోషన్లలో భాగమవుతున్నారు. ఇప్పుడు మూవీ యూనిట్ తో కలిసి మ్యూజిక్ పార్టీకి కూడా హాజరయ్యారు. ఈ ఫొటోలు చూస్తుంటే 'అలియాస్ రుక్మిణి' కోసం నాని ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది.
నిజానికి నాని ఈ సినిమాకు అతిథి మాత్రమే కాదు. సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నాని సోదరి దీప్తి గంటా యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ గ్లింప్స్‌లోనూ నాని తన వాయిస్ వినిపించాడు. దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ కథ చెబుతుంటే మధ్యలో ప్రశ్నలు అడుగుతూ, చివరకు స్క్రిప్ట్ నచ్చిందని చెప్పేలా ఆ ఆడియో గ్లింప్స్ ను రూపొందించారు. ఇప్పుడు పాటల ప్రమోషన్లలోనూ నాని భాగమయ్యారు.
లేటెస్ట్ గా 'అలియాస్ రుక్మిణి' టీమ్ ప్రత్యేకంగా జామ్ పార్టీ నిర్వహించింది. నితిన్, హీరోయిన్ ఆఫియా సయ్యద్, నాని సహా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాని, నితిన్ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ మ్యూజిక్ పార్టీకి సంబంధించిన వీడియోను త్వరలో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. రెగ్యులర్ ఇంటర్వ్యూలకు భిన్నంగా మ్యూజిక్‌తో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'రుక్కు రుక్కు రుక్మిణి' పాట విడుదలైంది. ఇప్పుడు రెండో పాటగా 'పిచ్చి ప్రేమలో'ను తీసుకొచ్చారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ మెలోడీని కార్తీక్ ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం రాశారు. భార్యాభర్తల మధ్య ప్రేమను చూపించే ఈ పాటలో నితిన్, ఆఫియా మధ్య కెమిస్ట్రీ అందంగా హైలెట్ అయ్యింది. సినిమాలో నితిన్ కృష్ణ అనే పాత్ర పోషిస్తున్నారు.
నితిన్‌కు ప్రస్తుతం మంచి హిట్ అవసరం. గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లతో విజయాలు అందుకున్న నితిన్, ఇటీవలి సినిమాలతో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ఇప్పుడు మురళీకాంత్ దర్శకత్వంలో మరో ప్రేమకథ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య జరిగే సంఘటనలకు ప్రాధాన్యం ఉండనుంది. నాని కూడా సినిమా కథపై నమ్మకంతోనే సమర్పకుడిగా ముందుకొచ్చినట్లు గతంలో చెప్పారు.
డిసెంబర్ 4న 'అలియాస్ రుక్మిణి' విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జోమోన్ టీ జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ చేస్తున్నారు. సాయికుమార్, హర్షవర్ధన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక జామ్ పార్టీ వీడియోలో నాని, నితిన్ మధ్య ఎలాంటి సరదా మూమెంట్స్ ఉంటాయో చూడాలి.
