మ్యూజిక్ వర్సెస్ డ్యాన్స్ : 'ప్యారడైజ్' వేదికపై 'సింగ్ గీతం' మ్యాజిక్!
ఈ ఈవెంట్‌ను తనదైన శైలిలో అద్యంతం రక్తి కట్టించడంలో స్టార్ యాంకర్ సుమ ప్రధాన పాత్ర పోషించారు.
By: Sivaji Kontham | 22 Sept 2026 9:35 AM ISTనేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `ప్యారడైజ్` ఈనెల 24న థియేటర్లలో అత్యంత గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సోమవారం సాయంత్రం జరిగిన ప్రీ-రిలీజ్ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ కేవలం ఒక సినిమా ప్రమోషన్ లా కాకుండా.. సంగీతం - నృత్యాల కలబోతతో ఒక అద్భుతమైన ఫీస్ట్‌లా సాగింది. వేదికపై ప్రతి క్షణం ఒక పండగలా అనిపించేలా సాగిన ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఈవెంట్‌ను తనదైన శైలిలో అద్యంతం రక్తి కట్టించడంలో స్టార్ యాంకర్ సుమ ప్రధాన పాత్ర పోషించారు. కెరీర్ ఆద్యంతం అద్భుతమైన యాంకరింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సుమ.. `ప్యారడైజ్` వేదికను మరింత స్పెషల్‌గా మార్చేశారు. ముఖ్యంగా నానికి దిష్టి తీయడానికి ఏకంగా వంద బ్లేడ్లతో వేదికపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టితో పాటు పైరసీ దిష్టి, నెగెటివిటీ దిష్టిని కూడా పోగొడతానని సరదాగా చెబుతూ సుమ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
కేవలం మాటలతోనే కాకుండా నృత్యాలతోనూ ఈ వేదిక జోరందుకుంది. చిత్రంలోని చార్ట్ బస్టర్ సాంగ్స్‌కు నానితో పాటు కథానాయిక కాయదు లోహర్, సీనియర్ నటి, హిందీ నటుడు రాఘవ్ జుయల్, కమెడియన్ సంపూర్ణేష్ బాబు .. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా స్టెప్పులేసి అదరగొట్టారు. ఒకరేమిటి.. చిత్రబృందం సభ్యులు, అతిథులు అందరూ కలిసి వేదికపై చేసిన డాన్సులు ప్రేక్షకులను విపరీతంగా రంజింపజేశాయి.
ముఖ్యంగా ఈ చిత్రంలోని #యేష నాగుల పాటకు చిత్రబృందం వేసిన స్టెప్పులు ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాయి. సినిమాలో ఈ పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా, ప్రీ-రిలీజ్ వేదికపై అదే ఊపును కొనసాగిస్తూ లైవ్‌లో చేసిన ప్రదర్శన అక్కడున్న అందరినీ ఉర్రూతలూగించింది. మ్యూజిక్ - డ్యాన్స్ మధ్య జరిగిన ఈ సరదా పోటీ వేడుకలో ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరిచింది.
ఈ ఈవెంట్ తాలూకు వైభవాన్ని చూసిన నెటిజన్లు, సినీ పరిశీలకులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ నిర్మాణంలో కొత్త తరంతో వచ్చిన ప్రయోగాత్మక చిత్రం `సింగ్ గీతం` తరహాలోనే ఈ వేడుక కూడా సాగిందని అభివర్ణిస్తున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం పాటలతో ముడిపడి ఉన్నట్లే.. ఈ ప్రీ-రిలీజ్ వేదిక కూడా పూర్తిగా సంగీతం- నృత్యమయమై ప్రతి ఒక్కరికీ సింగీతం సినిమాను గుర్తు చేయడం విశేషం.
