నాని మిస్సైన ఫ్యాన్స్.. ప్రేమ్ తెస్తారా?
సినిమా ఈవెంట్లకు వెళ్లినప్పుడు తన దగ్గరకు ముందుగా పరుగెత్తుకొచ్చేది చిన్నపిల్లలేనని నాని ఇటీవల చెప్పారు.
By: M Prashanth | 13 Oct 2026 12:00 PM ISTసినిమా ఈవెంట్లకు వెళ్లినప్పుడు తన దగ్గరకు ముందుగా పరుగెత్తుకొచ్చేది చిన్నపిల్లలేనని నాని ఇటీవల చెప్పారు. కానీ అదే పిల్లలు తన రెండు సినిమాలను థియేటర్లలో చూడలేకపోయారు. 'హిట్ 3', 'ది ప్యారడైజ్'లకు A సర్టిఫికెట్ వచ్చింది. యూత్ మాస్ ఆడియన్స్ కోసం డార్క్ కథలు చేయడం ఒక ఎత్తయితే, తనను ఇష్టపడే ఫ్యామిలీ ప్రేక్షకులను మిస్ అవడం మరో ఎత్తు. ఇప్పుడు నాని కొత్త ప్రేమకథ వైపు చూస్తున్న సమయంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ పేరు వినిపిస్తోంది.
నానికి ఫ్యామిలీ ఆడియన్స్‌తో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. 'భలే భలే మగాడివోయ్', 'నిన్ను కోరి', 'జెర్సీ', 'హాయ్ నాన్న' లాంటి సినిమాలతో వేర్వేరు వయసుల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ ఈ మధ్య యాక్షన్ కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 'సరిపోదా శనివారం' నుంచి 'హిట్ 3', 'ది ప్యారడైజ్' వరకు పాత్రల తీరు మారుతూ వచ్చింది. ఇందులో తప్పేమీ లేకపోయినా కొన్ని సినిమాలు ఫ్యామిలీ కిడ్స్ తో కలిసి చూసే అవకాశం లేకుండా పోయింది.
ఈ విషయాన్ని నాని స్వయంగా గుర్తుచేశారు. 'హిట్ 3', 'ది ప్యారడైజ్' A సర్టిఫికెట్ సినిమాలు కావడంతో చిన్నపిల్లలు థియేటర్లకు రాలేకపోయారని చెప్పారు. తన కొడుకు కూడా 'ది ప్యారడైజ్' చూడాలని అడిగినా ఇప్పుడే వద్దని చెప్పాల్సి వచ్చిందట. 'బ్లడీ రోమియో' తర్వాత అందరూ చూడగలిగే ఒక స్వీట్ లవ్ స్టోరీ చేస్తానని వెల్లడించారు. అయితే అది పూర్తిగా ఫ్యామిలీ సినిమా అని మాత్రం చెప్పలేదు.
ఇలాంటి సమయంలో '96' దర్శకుడు ప్రేమ్ కుమార్‌తో నాని సినిమా చేయబోతున్నారనే ప్రచారం రావడం హైలెట్ అవుతోంది. '96'లో ప్రేమను పెద్ద డైలాగులు, భారీ ఎలివేషన్లతో కాకుండా చిన్నచిన్న జ్ఞాపకాలతో చెప్పారు. 'సత్యం సుందరం'లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్నే కథగా నడిపించారు. ప్రేమ్ సినిమాల్లో హీరో గొప్పతనం కంటే మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్‌కు ఎక్కువ చోటుంటుంది. ఆ తరహా కథ నాని దగ్గరకు వస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
అయితే ప్రేమ్ కుమార్ సినిమా అనగానే పిల్లలంతా థియేటర్లకు వస్తారని అనుకోవడానికి లేదు. '96' ఎక్కువగా పెద్దవాళ్ల ప్రేమ జ్ఞాపకాల చుట్టూ సాగింది. 'సత్యం సుందరం'లోనూ నెమ్మదిగా సాగే సంభాషణలకు ప్రాధాన్యం ఉంది. కాబట్టి నాని కోరుకుంటున్న అన్ని వయసుల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ కావాలంటే ఈసారి ప్రేమ్ ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నారనేది ముఖ్యం. నాని ఇమేజ్ కోసం దర్శకుడు తనకు అలవాటైన కథనాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఇంకా నాని, ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రాలేదు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తారనే వార్తలు కూడా ప్రచారంలోనే ఉన్నాయి. నాని మాత్రం సుజీత్ దర్శకత్వంలోని 'బ్లడీ రోమియో' తర్వాత ప్రేమకథ చేయనున్నట్లు చెప్పారు. ఇక ప్రేమ్ కుమార్ ఫహాద్ ఫాజిల్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత నానితో ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
