స్పీడ్ రేంజ్.. నాని చేతిలో లేకపోయినా సరే..
ఇటీవల మాత్రం ప్రాజెక్టుల మధ్య ఎక్కువ గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. కారణం నాని కంటే.. ఆయన సినిమాలు తెరకెక్కుతున్న స్పీడే అని టాక్.
By: M Prashanth | 11 July 2026 2:50 PM ISTవరుస విజయాలతో దూసుకెళ్తున్న హీరో నాని గురించి ఫ్యాన్స్ ఇప్పుడు ఒకటే విషయం మాట్లాడుకుంటున్నారు. అది సినిమా స్టోరీ కాదు.. రోల్ కాదు.. ఆయన స్పీడ్. ఏడాదికి ఒకటి లేదా రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే నాని.. ఇటీవల మాత్రం ప్రాజెక్టుల మధ్య ఎక్కువ గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. కారణం నాని కంటే.. ఆయన సినిమాలు తెరకెక్కుతున్న స్పీడే అని టాక్.
ప్రస్తుతం నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి రూపొందుతున్న ఆ చిత్రం ప్రకటించినప్పటి నుంచే మంచి హైప్ సొంతం చేసుకుంది. అయితే వివిధ కారణాలతో షూటింగ్, నిర్మాణ పనులు అనుకున్న వేగంతో సాగలేదని తెలుస్తోంది. దీంతో విడుదల కూడా ఆలస్యమవుతోంది. ప్యారడైజ్ లేట్ అవ్వడం వల్ల నాని నెక్స్ట్ సినిమాల షెడ్యూల్ కూడా ప్రభావితమవుతోందనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే దర్శకుడు సుజీత్ తో చేయనున్న బ్లడీ రోమియో సహా మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. కానీ ఒక సినిమా లేటైతే, దాని ఎఫెక్ట్ తర్వాత సినిమాలపై కూడా పడటం సహజం. దీంతో నాని నుంచి కొత్త సినిమాలు రావడానికి అభిమానులు మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ ఆలస్యానికి పూర్తిగా హీరోదే తప్పనుకోవడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఒక సినిమా నిర్మాణంలో డైరెక్డర్, ప్రొడ్యూసర్, టెక్నికల్ టీమ్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి అనేక అంశాలు కీలకంగా ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి ఆలస్యమైనా మొత్తం ప్రాజెక్టు షెడ్యూల్ మారిపోతుంది. అందుకే ఇది పూర్తిగా హీరో చేతిలో ఉండే విషయం కాదని చెప్పాలి. అయితే అభిమానుల కోరిక మాత్రం ఒక్కటే. ప్రాజెక్టు ప్రారంభించే ముందే దర్శకులు పూర్తి ప్లాన్ తో ముందుకు రావాలని, కథ, స్క్రిప్ట్, షెడ్యూల్ అన్నీ క్లియర్ గా సిద్ధం చేసుకుని షూటింగ్ ప్రారంభిస్తే అనవసర సమస్యలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు.
అదే సమయంలో త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడిలో క్వాలిటీ తగ్గకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. నాని ఇప్పటివరకు కథల ఎంపికలో చూపించిన జాగ్రత్తే ఆయన విజయాలకు ప్రధాన కారణం. అందుకే అభిమానులు కూడా స్పీడ్ పెరగాలని కోరుకుంటున్నప్పటికీ, క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండకూడదని క్లారిటీ చేస్తున్నారు. మంచి సినిమా కోసం కొంతకాలం ఎదురు చూడడానికి సిద్ధమే కానీ, అనవసరమైన ఆలస్యాలు మాత్రం ఉండకూడదనేది వారి అభిప్రాయం.
ఇప్పుడు నాని స్పీడ్ తగ్గిందనే చర్చ కంటే, ఆయన సినిమాల ప్రొడక్షన్ స్పీడ్ పెరగాలనే ఆశ అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. హీరో చేతిలో లేకపోయినా, ప్రాజెక్టుల ప్లాన్ సరిగ్గా ఉంటే నాని నుంచి వరుసగా సినిమాలు చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నాని అభిమానులు అంతా కోరుకుంటున్నది ఒక్కటే.. కంటెంట్ లో అదే క్వాలిటీ.. రిలీజుల్లో కాస్త స్పీడ్.
