నాని సినిమాలు.. నిర్మాతలు ఎందుకు మారుతున్నారు?
టాలీవుడ్ నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని సినిమాల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే.
By: M Prashanth | 25 Feb 2026 5:00 AM ISTటాలీవుడ్ నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని సినిమాల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. కథ, దర్శకుడు, టెక్నీషియన్స్ విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకునే నాని.. ఇప్పుడు నిర్మాతల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా రీసెంట్ గా రెండు సినిమాలకు గాను చివరి నిమిషంలో నిర్మాతలు మారడం ఆసక్తికరంగా మారింది.
కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమాను మొదట సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించాల్సి ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆ బ్యానర్ పైనే ప్రారంభమయ్యాయి. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి ఆ సంస్థ తప్పుకుని, నిర్మాతగా వెంకట్ బోయనపల్లి ఎంట్రీ ఇచ్చారు. చివరికి ఆయన నిర్మాణంలోనే సినిమా పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయం కూడా సాధించింది.
అప్పుడు అది నార్మల్ గా ప్రొడ్యూసర్ ఛేంజ్ అయ్యి ఉంటారని అంతా భావించారు. కానీ ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి రావడంతో అందరి దృష్టి నానిపై పడింది. ప్రస్తుతం నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా బ్లడీ రోమియో. ఆ సినిమాను మొదట డీవీవీ దానయ్య నిర్మిస్తారని అధికారిక ప్రకటన వచ్చింది. ఫ్యాన్స్ కూడా అదే ఫిక్స్ అయ్యారు.
కానీ తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం.. బ్లడీ రోమియో ప్రాజెక్ట్ కూడా ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి చేతులకు వెళ్లింది. దీంతో వరుసగా రెండోసారి నాని సినిమా నిర్మాత మారడం హాట్ టాపిక్ గా మారింది. చివరి నిమిషంలో ఇలా మార్పులు ఎందుకు? అనే ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే నాని తన సినిమాల విషయంలో పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ కోరుకుంటారని ఎప్పుడూ టాక్ వినిపిస్తోంది.
బడ్జెట్, ప్లానింగ్, షూటింగ్ షెడ్యూల్స్ వంటి అంశాల్లో తనకు కంఫర్ట్ గా అనిపించే నిర్మాతలతోనే ముందుకు వెళ్లాలని చూస్తారని అంతా చెబుతుంటారు. ముఖ్యంగా వెంకట్ బోయనపల్లితో మంచి అనుబంధం ఉండటంతో మళ్లీ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే సమయంలో ప్రాజెక్ట్ కూల్ గా ముందుకు వెళ్లడానికి నమ్మకం చాలా ముఖ్యం.
ఆ నమ్మకం ఉన్న నిర్మాతతో పని చేయడమే నాని లక్ష్యం అని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రొడ్యూసర్ల విషయంలో మార్పులు జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా నిర్మాతల మార్పు వార్తలతో నాని కొత్త సినిమా బ్లడీ రోమియోపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరగ్గా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వినికిడి.
