'ఆయా షేర్'తో ఊగిపోయిన అనిరుధ్ కన్సర్ట్.. నాని డ్యాన్స్ చూశారా?
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
By: M Prashanth | 22 March 2026 10:59 AM ISTరాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ నిర్వహించిన అనిరుధ్ XV (15 ఇయర్స్ విత్ యు) లైవ్ కన్సర్ట్ మ్యూజిక్ లవర్స్ ను ఉర్రూతలూగించింది. అందుకు వేదికగా మారిన హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం శనివారం రాత్రి మార్మోగింది. కన్సర్ట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలోని ఆయా షేర్ సాంగ్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
కన్సర్ట్ మధ్యలో ఆయా షేర్ ట్రాక్ మొదలవగానే స్టేడియం మొత్తం ఒక్కసారిగా అరుపులతో మార్మోగింది. అనిరుధ్ తన ఎనర్జిటిక్ లైవ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. అదే సమయంలో ప్రేక్షకుల్లో ఉన్న హీరో నాని కూడా ఆ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేయడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. అభిమానులతో కలిసి నాని చేసిన స్పాంటేనియస్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే ఆ ఈవెంట్ లో పాల్గొన్న మ్యూజిక్ లవర్స్.. ఆయా షేర్ సాంగ్ కు ఫుల్ గా రెస్పాండ్ అయ్యి.. మొబైల్ లైట్లతో స్టేడియాన్ని నింపేశారు. ఆ సాంగ్ పెర్ఫార్మెన్స్ టైమ్ లో స్టేడియం అంతా ఒక బిగ్ మ్యూజికల్ ఫెస్టివల్ వాతావరణాన్ని తలపించింది.
ముఖ్యంగా పాటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. ఆ ట్రాక్ ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల విడుదలైన ఆయా షేర్ పాటకు భారీ ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ తో పాటు వేల సంఖ్యలో ఇన్ స్టా రీల్స్ కనిపిస్తున్నాయి. యూత్ నుంచి మాస్ ప్రేక్షకుల వరకు అందరినీ ఆకట్టుకునేలా సాంగ్ రూపొందింది.
మ్యూజిక్, బీట్, విజువల్స్ అన్నీ ఆ సాంగ్ ను చార్ట్ బస్టర్ గా నిలబెట్టాయి. అయితే ఆయా షేర్ ను కంపోజ్ చేసి అనిరుధ్, స్వయంగా ఆలపించడం విశేషం. ది ప్యారడైజ్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నాని దసరా సినిమాతో దర్శకుడిగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఓదెల, ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు సుధాకర్ చెరుకూరి చేపట్టారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆయా షేర్ పాటతో వచ్చిన హైప్ చిత్రంపై మరింత ఆసక్తి పెంచింది. మొత్తానికి అనిరుధ్ లైవ్ కన్సర్ట్ లో ఆయా షేర్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించింది. రాబోయే రోజుల్లో ది ప్యారడైజ్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో సందడి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ప్యారడైజ్ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
