టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ పర్‌ఫెక్ట్ బ్యాలెన్స్!
పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిన్న చిత్రాలను నిర్మించడంలో నాని చూపుతున్న చొరవ టాలీవుడ్‌లో కొత్త ఒరవడికి కారణమైంది.
By: Srikanth Kontham | 9 Aug 2026 12:00 AM ISTనేచురల్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటోన్న నాని నటుడిగానే కాకుండా శక్తివంతమైన నిర్మాతగానూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో నటుడిగా బిజీగా ఉంటూనే.. మరోవైపు నూతన దర్శకులను, విభిన్న కథాంశాలను ప్రోత్సహిస్తూ నిర్మాతగా నాని సాధిస్తున్న విజయాలు సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నటన .. నిర్మాణ రంగాల మధ్య నాని పాటిస్తున్న చక్కటి సమతుల్యత నవతరానికి ఆదర్శంగా నిలుస్తోంది.
పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి తనదైన సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నాని కాలక్రమేణా తన పరిధిని మరింత విస్తరించుకుంటున్నారు. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కమర్షియల్ హంగులు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిన్న చిత్రాలను నిర్మించడంలో నాని చూపుతున్న చొరవ టాలీవుడ్‌లో కొత్త ఒరవడికి కారణమైంది.
'అ' సినిమాతో మొదలైన నాని నిర్మాణ ప్రయాణం `హిట్` ఫ్రాంచైజీ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మరింత నమ్మకాన్ని సంపాదించుకుంది. అదే బ్యానర్‌లో రిలీజ్ అయిన 'కోర్ట్' వంటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా నిర్మాతగా నానికున్న అంచనా సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాయి. కథల ఎంపికలో నాని అనుసరించే విధానం, వ్యూహాలు ఆ సినిమాలను విజయ తీరాలకు చేర్చాయన్నది కాదనలేని నిజం.
నాని ప్రచార వ్యూహాలు కూడా చిత్రాల విజయానికి ఎంతగానో దోహదపడుతున్నాయని ప్రముఖ నిర్మాతలు సైతం ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకుల నాడీని పట్టుకుని, సరికొత్త ఆలోచనలతో సినిమాలను మార్కెట్ చేసే నాని నైపుణ్యం ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చనీయాంశమైంది. నటుడిగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా? నిర్మాణ రంగంలో ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం నాని అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.
దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం ఓ సందర్భంలో నాని కృషిని కొనియాడుతూ గత దశాబ్ద కాలంలో నాని చేసినన్ని చిత్రాలు చేయడం, ఎంతోమంది కొత్త ప్రతిభావంతులను పరిచయం చేయడం ఆయనకు సినిమాపై ఉన్న అంతులేని ప్రేమను తెలియజేస్తుందని ప్రశంసించారు. నటుడిగా ప్రేక్షకులను రంజింపజేస్తూనే.. నిర్మాతగా ఇండస్ట్రీకి అవసరమైన బలమైన పునాదులను వేయడంలో నాని పాత్ర ఎంతో కీలకంగా మారుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద ప్రాజెక్ట్‌లతో అడుగుపెడుతున్న నాని భవిష్యత్తులోనూ నిర్మాణ సంస్థ ద్వారా మరిన్ని అద్భుతమైన చిత్రాలను అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నటుడిగా తన మార్క్ కొనసాగిస్తూనే.. నిర్మాతగా ఇండస్ట్రీ రూపురేఖలను మార్చే శక్తిగా ఎదుగుతున్న నాని ప్రయాణం ప్రశంసనీయం.
