Begin typing your search above and press return to search.

నాని 'బ్లడీ రోమియో' సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌

‘ది ప్యారడైజ్’ తర్వాత నాని సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’పై దృష్టి పెట్టారు. ‘అలియాస్ రుక్మిణి’ ప్రమోషన్ల కారణంగా లండన్ షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారానికి వాయిదా పడినట్లు సమాచారం. ఫిబ్రవరి 2027 నాటికి షూటింగ్ పూర్తి చేసి, మే లేదా జూన్‌లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Ramesh Palla   |   29 Nov 2026 3:00 PM IST
నాని బ్లడీ రోమియో సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌
X

నేచురల్‌ స్టార్ నాని భారీ అంచనాలు పెట్టుకుని చేసిన 'ది ప్యారడైజ్‌' మూవీ ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది. హింస ఎక్కువ అయిందని కొందరు అంటే, కథనం లో లోపాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి ది ప్యారడైజ్‌ మూవీ విషయంలో నాని కూడా ఒకింత అసంతృప్తికి గురి అయినట్లు తెలుస్తోంది. నాని ఒక సినిమా విఫలం అయితే వెంటనే దాని నుంచి తేరుకుని మరో సినిమాను చేయగలడు. చాలా మంది హీరోల మాదిరిగా ఒక సినిమా ఫెయిల్‌ అయితే ఆ సినిమాను గురించే ఆలోచించుకుంటూ కూర్చోడు. నాని ఇప్పటికే సుజీత్‌ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. వీరి కాంబోలో మూవీ చాలా ఏళ్ల క్రితమే రావాల్సి ఉన్నా, పవన్‌ కళ్యాణ్‌ తో ఓజీ సినిమాను చేసే అవకాశం రావడంతో సుజీత్‌ ఈ సినిమాను పక్కన పెట్టాడు. నాని సైతం ఓజీ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత సుజీత్‌తో మూవీ మొదలు పెట్టాడు.

బ్లడీ రోమియో సినిమాలో నాని...

ఓజీ కి వచ్చిన రెస్పాన్స్‌ కారణంగా సుజీత్‌ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన నుంచి మరో స్టైలిష్‌ యాక్షన్‌ డ్రామాను ప్రేక్షకులు ఆశిస్తున్నారు. నానితో అదే తరహా భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను సుజీత్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. బ్లడీ రోమియో సినిమా గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సోషల్‌ మీడియాలోనూ ఈ సినిమా గురించి ఎక్కువ ప్రచారం జరగడం లేదు. ఆ మధ్య ఢిల్లీలో ఒక షెడ్యూల్‌ నిర్వహిస్తున్న సమయంలో నాని లుక్‌ లీక్ అయింది. ఢిల్లీ షూట్‌ కి సంబంధించిన నాని లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పాటు, బ్లడీ రోమియో సినిమాపై అంచనాలు పెంచాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎంత మేరకు షూటింగ్‌ అయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే చర్చ నాని అభిమానుల్లోనూ, మీడియా సర్కిల్స్‌లోనూ కనిపిస్తుంది.

అలియాస్ రుక్మిణి కోసం నాని...

ఇటీవల హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసిన బ్లడీ రోమియో నవంబర్‌ చివరి వారం లో అంటే ఇప్పుడు లండన్‌ షెడ్యూల్‌ లో ఉండాల్సింది. కానీ నితిన్‌ హీరోగా రూపొందిన అలియాస్ రుక్మిణి సినిమా విడుదల ఉండటం, ఆ సినిమాను నాని సోదరి నిర్మించడం, నాని స్వయంగా సమర్పిస్తున్న కారణంగా ప్రమోషన్‌లో పాల్గొనాల్సి వస్తుంది. అలియాస్ రుక్మిణి సినిమా ప్రమోషన్‌లో నాని యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. విడుదలకు మరో మూడు రోజుల సమయం ఉంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత కూడా నితిన్‌తో కలిసి నాని రెండు మూడు ఇంటర్వ్యూలు, టాక్‌ షో లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలియాస్ రుక్మిణి సినిమా విడుదల అయ్యే వరకు నాని హైదరాబాద్‌లోనే ఉంటాడని సమాచారం అందుతోంది. అంటే లండన్‌ షెడ్యూల్‌ ను డిసెంబర్‌ మొదటి వారంకు వాయిదా వేయడం జరిగింది.

సుజీత్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ యాక్షన్‌ మూవీ...

డిసెంబర్‌ నెల చివరి వరకు లండన్‌ షెడ్యూల్‌ జరగబోతుంది. ఆ షెడ్యూల్‌ పూర్తి అయిన వెంటనే జనవరిలో మరోసారి హైదరాబాద్‌లో కీలకమైన ఆఖరి షెడ్యూల్‌ ఉంటుందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి 2027 వరకు మొత్తం షూటింగ్ పూర్తి చేసి, గుమ్మడి కాయ కొట్టేందుకు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. మరీ ఆలస్యం చేయకుండా కచ్చితంగా 2027 సమ్మర్‌లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నాని అండ్‌ సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడీగా ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాకుండా మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ధురంధర్‌ ఫేం వివేక్ సిన్హా, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నాని లుక్‌ విషయంలో సుజీత్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. స్టైలిష్ అవతారంలో నానిని చూపించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నానితో కలిసి నిర్మిస్తున్నాడు. 2027 మే లేదా జూన్‌ లో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.