పెళ్లిచూపులు టు వనవీర నో ఛేంజ్!
హీరోగా నిలబడలేక, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రభావాన్ని చూపించలేకపోయాడు. దానికి ప్రధాన కారణం తను ఎంచుకున్న సినిమాలే.
By: Tupaki Entertainment Desk | 3 Jan 2026 10:30 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా సుడి ఉంటే ఎవరి జాతకాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం కష్టం. సుడి లేని వాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏదో చేస్తున్నాం.. అంటే చేస్తున్నాం.. ప్రయత్నం చేస్తున్నాం అంటూ సాగుతుంటారు. అలాంటి వారికి ఎప్పటికో గానీ బ్రేక్ రాదు. ఇరవైళ్లుగా ప్రయత్నించినా బ్రేక్ రాని వారు ఇండస్ట్రీలో ఉన్నారంటే అందులో అతిశయోక్తిలేదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని యంగ్ హీరో నందు ఎదుర్కొంటున్నాడు.
సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 'ఫొటో' సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. థాయ్ ఫిల్మ్ 'షట్టర్' ఆధారంగా ఈ మూవీని శివ నాగేశ్వరరావు రూపొందించారు. అంజలి, ముక్త హీరోయిన్‌లుగా నటించిన ఈ మూవీ సూపర్ నేచురల్ థ్రిల్లర్. దీంతో హీరోగా పరిచయమైన నందు ఆ తరువాత హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం మొదలు పెట్టాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వర్మ 365 డేస్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఇక అప్పటి నుంచి పెళ్లి చూపులు నుంచి వనవీర వరకు హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ ఆర్టిస్ట్‌గా, హీరోగా మాత్రం రెండు దశాబ్దాల కాలంలో ఎలాంటి గుర్తింపుని పొందలేకపోయాడు. హీరోగా నిలబడలేక, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రభావాన్ని చూపించలేకపోయాడు. దానికి ప్రధాన కారణం తను ఎంచుకున్న సినిమాలే. హీరోగా నటించిన సినిమాల్లో అత్యధికం ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో తెలియని పరిస్థితి. రీసెంట్‌గా నందు మూడు సినిమాల్లో నటించాడు.
ఇందులో విచిత్రం ఏంటంటే ఒక మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, మరో సినిమాలో విలన్, ఓ సినిమాలో హీరో. ఇది రేర్ ఫీట్ అని చెప్పాల్సిందే. నందు హీరోగా నటించిన మూవీ 'సైక్ సిద్ధార్ధ'. ఈ సినిమతో హీరోగా సక్సెస్‌ని సొంతం చేసుకోవాలని చాలా గట్టిగానే శ్రమించాడు. కానీ ఫలితం తారుమారైంది. సినిమా బాగున్నా దానికి తగ్గ బజ్ లేదు. రానా రంగంలోకి దిగి ప్రమోసన్స్ చూసుకున్నా నందుకు కలిసి రాలేదు. దీంతో చాలా మంది నందు కష్టం చూసి ప్చ్ ఒక్క హిట్ పడాల్సిందని ఫీలవుతున్నారు.
నందు సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నటించగా హీరోలుగా అరంగేట్రం చేసిన వాళ్లలో ఎక్కువ మంది టాలీవుడ్‌లో స్టార్‌ల జాబితాలో చేరి స్టార్‌లుగా సెట్టయితే నందు మాత్రం రెండు దశాబ్దాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు అత్యధికంగా నిర్మితమవుతున్న నేపథ్యంలో నందు కొత్త కథలని ఎంచుకోవాలని, అప్పుడే హీరోగా సక్సెస్ అవుతాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
