Begin typing your search above and press return to search.

సైక్ సిద్ధార్థ్ టీజర్ రిలీజ్..

ఈ మధ్యకాలంలో సెన్సార్ బోర్డు ఎన్ని కోతలు విధించినప్పటికీ కూడా అటు దర్శకనిర్మాతలు ఏదో ఒక బూతు సన్నివేశాలను సినిమాలో పెట్టడం.. బూతు పదాలను వాడడం సహజం అయిపోయింది.

By:  Madhu Reddy   |   8 Nov 2025 4:18 PM IST
సైక్ సిద్ధార్థ్ టీజర్ రిలీజ్..
X

ఈ మధ్యకాలంలో సెన్సార్ బోర్డు ఎన్ని కోతలు విధించినప్పటికీ కూడా అటు దర్శకనిర్మాతలు ఏదో ఒక బూతు సన్నివేశాలను సినిమాలో పెట్టడం.. బూతు పదాలను వాడడం సహజం అయిపోయింది. ఒకప్పుడు బూతు మాట్లాడడం అంటేనే మహా పాపంగా భావించే కాలం నుండి నేడు సినిమాలలో కూడా ఈ పదాలను ఉపయోగించే స్థాయికి చేరుకున్నారు అంటే.. ఈ పదాలను ప్రజలు ఎంత అవలీలగా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పదాలు వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. సినిమాలలో పదేపదే ఉపయోగిస్తూ.. చూసే ఒక వర్గం ఆడియన్స్ కి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇకపోతే ఇలాంటి పదాలను మ్యూట్ చేయాలని సెన్సార్ బోర్డు చెప్పినా.. ఇవి సహజంగా వాడే పదాలే కదా అంటూ దర్శకనిర్మాతలు కూడా సమర్ధించుకుంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి బూతు పదాలతోనే మనం ముందుకు రాబోతున్నారు నందు.

ప్రముఖ హీరో నందు తాజాగా నటించిన చిత్రం సైక్ సిద్ధార్థ్.. తాజాగా హీరో క్యారెక్టర్రైజేషన్ ను రివీల్ చేస్తూ టీజర్ విడుదల చేశారు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నందు హీరో మాత్రమే కాకుండా రచన కూడా అందించారు. ఆసియన్ సురేష్ సంస్థలు నిర్మాణ భాగస్వామ్యం కాగా.. క్యాస్టింగ్ లో యామిని భాస్కర్, ప్రియాంక రెబెకా తదితరులు నటిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.

సినిమా విషయానికి వస్తే.. తాజాగా విడుదల చేసిన టీజర్ లో హైదరాబాదులో ఉండే ఒక యువకుడి పాత్రలో నందు నటిస్తున్నట్లు చూపించారు. నగర వాతావరణం మనుషుల ప్రవర్తన చూసి విసిగిపోయిన సైకో తరహాలో మాటకు ముందు.. వెనుక బూతులు లేనిదే సంభాషణ చేయలేడు. స్నేహితుడైనా.. ప్రియురాలైనా.. ఈయన మాటలకు బెదిరిపోవాల్సిందే. యూత్ ని టార్గెట్ చేయడమే ఈ కథ ప్రధాన ఉద్దేశం గా అనిపిస్తుంది. ఇకపోతే ఆర్టిస్ట్ గా నందు మంచి పెర్ఫార్మర్ అయినప్పటికీ కనీసం ఫ్యామిలీతో కూర్చుని టీజర్ కూడా చూడలేనంత బూతులు ఇందులో పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి దీనిపై ఇటు ఆడియన్స్ లో అటు అభిమానులలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

ఇక నందు విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో నటుడిగా నటించడమే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు. నందు 2006లో వచ్చిన ఫోటో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రేమించే రోజుల్లో, 100% లవ్, ఆటోనగర్ సూర్య, పాఠశాల, రభస, ఐస్ క్రీమ్ 2, పెసరట్టు, సవారి, సెహరి, బొమ్మ బ్లాక్ బస్టర్, ప్రసన్న వదనం వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగా కూడా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు నందు.

ఎప్పుడు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించిన నందు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. మరి ఈ సినిమాతో నందు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఇకపోతే సింగర్ గీతామాధురిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.